ఖైరతాబాద్, ఆగస్టు 5 : ప్రగతి రథ చక్రాలకు కొద్దిసేపు బ్రేక్ పడింది. బస్ భవన్లో ఉండాల్సిన ఆర్టీసీ ఉద్యోగులు రాజ్‌భవన్‌కు కదం తొక్కారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపకపోవడంతో ఆందోళన బాట పట్టారు. పల్లె వెలుగు నడిపే తమ జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతుంటే.. గవర్నర్ మాత్రం తమ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న డిపోల ఎదుట ధర్నా చేపట్టారు. బస్ భవన్ నుంచి రాజ్‌భవన్ వరకు ఐదు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు భారీ ర్యాలీ తీశారు. దాదాపు మూడు గంటలకు పైగా రాజ్‌భవన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రగతి రథ చక్రాల సారథులు, రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తం గా కదం తొక్కారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతుంటే.. గవర్నర్ మాత్రం విలీనం చేసే బిల్లును ఆమోదించకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రతి ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీలో ఆమోదం పొంది ప్రభుత్వ ఉద్యోగులుగా చెలామణి అవుతామనుకున్న వారి ఆశలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. దీంతో గవర్నర్ చర్యలను నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన బాటపట్టారు. అన్ని జిల్లాల్లో ఉన్న బస్‌డిపోల ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు రెండు గంటల పాటు నిరసన, ధర్నా, కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు గ్రేటర్‌లోని ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బస్ భవన్ నుంచి వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి ఐమాక్స్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ రాజ్‌భవన్ ముట్టడికి బయలుదేరారు. సుమారు మూడు గంటలకు పైగా రాజ్‌భవన్ వద్ద బైఠాయించి ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు.
పండుగ చేసుకున్నాం.. దండుగ చేయొద్దు..
జీవితంలో ఈ రోజు వస్తుందని ఏ నాడు అనుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన రోజు మా సంతోషానికి అవధులు లేవు. మా డిపోలో స్వీట్లు పంచుకొని పండుగ చేసుకున్నాం.. దండుగ చేయొద్దు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఈ తరుణంలో గవర్నర్ నిర్ణయం సరికాదు.
– ఎ. మహాదేవి, ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు సభ్యురాలు, చెంగిచెర్ల డిపో
ఆర్టీసీనే నమ్ముకొని పనిచేస్తున్నాం..
ఆర్టీసీలో ఉద్యోగం అంటే మాములు విషయం కాదు. నిత్యం రోడ్డుపై ఉంటూ కష్టపడుతూ ప్రజలకు సేవలందిస్తున్నాం. వేతనాలు తక్కువగా వచ్చినా సంస్థపై నమ్మకంతో కొన్నేండ్లుగా ఆర్టీసీనే నమ్ముకొని పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడిలా తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని సంకల్పించారు. కాని గవర్నర్ బిల్లును అడ్డుకొని తమ ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు.
సాటి మహిళగా స్పందించండి
ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న మా కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రకటన జారీ చేశారు. నేడో, రేపో అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొంది మా కల నెరవేరే తరుణంలో ఇలా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం. ఆర్టీసీలో పురుషులతో పాటు సమానంగా మహిళా ఉద్యోగులు ఉన్నారు. కుటుంబాన్ని, పిల్లలను వదిలి రోజు విధులు నిర్వహిస్తున్నాం. సాటి మహిళగా గవర్నర్ తమ గోడును పట్టించుకోవాలి. బిల్లుకు ఆమోదం తెలుపాలి.
– బి. ఛాయాదేవి, కండక్టర్, దిల్సుఖ్నగర్ డిపో
బిల్లును ఆమోదించండి..
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదు. కనీసం ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న సూచనలు కూడా చేయలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. మంచి జరుగుతున్న ఈ తరుణంలో విలీనంపై నీలి మేఘాలు కమ్ముకున్నట్లుగా గవర్నర్ వ్యవహరించారు. దయచేసి వేలాది మంది భవిష్యత్‌కు సంబంధించిన ప్రక్రియను అడ్డుకోవద్దు..బిల్లును ఆమోదించండి.
– యాదమ్మ, కండక్టర్, కుషాయిగూడ డిపో
బిల్లు ప్రక్రియను అడ్డుకోవద్దు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న తమకు ఒకటే ఆశయం ఉండేది. శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనాలు అందుకోవాలని అనుకున్నాం. ఎట్టకేలకు ప్రభుత్వం తమ కష్టాలను గ్రహించి ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఆలోచనతో ప్రకటన చేసింది. కొన్ని గంటల్లో తాము ప్రభుత్వ ఉద్యోగులుగా చెలామణి కావాల్సి ఉంది. రాష్ట్ర గవర్నర్ తమపై దయతలచి బిల్లు ప్రక్రియను అడ్డుకోవద్దు.
– పి. సత్యమ్మ, కండక్టర్, కూకట్పల్లి డిపో