తెలంగాణ ప్రజల ఆస్తి టిఆర్ఎస్
యావన్మందికి కాపలాదారు
పెట్టనికోట.. కంచుకోట గులాబీ పార్టీ
రెండు దశాబ్దాల అప్రతిహత ప్రయాణం
ఆగమయ్యే కాడి నుంచి ఆదర్శంగా నిలిచినం
అన్నింట్లో మనమే నంబర్.1
గేలి చేసినోళ్లు గోల్మాల్ అయ్యిండ్రు
ప్లీనరీలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్
భాగ్యనగరం గులాబీవనమైంది. ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో కూడళ్లు, రహదారుల్లో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రాలు, భారీ కటౌట్లు ఆకర్షణీయంగా కనిపించాయి. పార్టీ ప్రస్థానం, గెలుపుబావుటా తెలిపే ఫ్లెక్సీలను పలుచోట్ల ఏర్పాటు చేశారు.
‘వివక్ష, అవమానాలు, అన్యాయాలను ఛేదించేందుకు ఆవిర్భవించిందే టీఆర్ఎస్ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. తెలంగాణ ప్రజల కాపలాదారు. యావన్మందికి రక్షణ, భద్రత ఇస్తున్న పార్టీ. తెలంగాణకు పెట్టనికోట గులాబీ జెండా. ఏ శక్తీ బద్ధలుకొట్టలేని కంచుకోట. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ర్టాన్ని రోల్‌మోడల్‌గా నిలిపినం. అన్నిరంగాల్లో అగ్రగామిగా చేసినం. 21 ఏండ్ల పార్టీ చరిత్రలో ఈ శతాబ్దానికి దిక్సూచి అయినం. రాష్ర్టానికి కేంద్రం సాయం చేయకున్నా గెలిచి నిలిచినం. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచినం. 80శాతం మంది ప్రజా ప్రతినిధులు, 60 లక్షలమంది బలగం, సుమారు రూ. 1000 కోట్ల ఆస్తులున్న పార్టీ మనది. రెండు దశాబ్దాల కలను సాకారం చేసుకొని లక్ష్యాన్ని ముద్దాడినం’ అని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వివరించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగిన ప్లీనరీలో రాష్ట్ర ప్రగతిని సీఎం ప్రజలకు నివేదించారు.
చిత్తశుద్ధితోనే సాధ్యం
లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. ఇందుకు తార్కాణం రాష్ట్ర ప్రగతి. అతిచిన్న వయసులో పెద్ద రాష్ర్టాలను మించి అభివృద్ధి సాధించినం. అవినీతిరహిత పాలన అందిస్తూ ముందుకు పోతున్నం. అనేక విజయాలను సొంతం చేసుకున్నం. ఇవన్నీ మన పాలనాదక్షత,అంకితభావానికి మచ్చుతునకలు. – సీఎం కేసీఆర్
సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/మియాపూర్/మాదాపూర్: టీఆర్ఎస్ పార్టీ.. ఏ వ్యక్తిదో..శక్తిదో కాదు.. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ప్రజల అభ్యున్నతికి పరితపించే పార్టీ… ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణకు కాపలాదారు… అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ 21 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం హైటెక్స్ వేదికగా ప్లీనరీ సమావేశం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. తెలంగాణను పాలనలో మోడల్‌గా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అభివృద్ధి, సంక్షేమంలో 21వ శతాబ్దానికి దిక్సూచిగా మార్చారు.
పార్టీ ప్లీనరీ సమావేశాన్ని కూడా అదే స్థాయిలో నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక బార్కోడ్లు కేటాయించి, పార్కింగ్ నుంచి సీట్ల కేటాయింపు వరకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. భగ భగ మండుతున్న ఎండలోనూ చల్లని వాతావరణాన్ని కల్పించి చక్కటి అనుభూతిని మిగిల్చారు. సువిశాలమైన వేదికతోపాటు, విభిన్న రకాల నోరూరించే రుచులతో కార్యకర్తలకు కడుపునిండా కమ్మటి భోజనాన్ని వడ్డించారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ 21 ఏండ్ల జైత్రయాత్రను తెలియజేస్తూనే దేశ భవిష్యత్‌ను మార్చటంలో పోషించాల్సిన పాత్రపై పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
సీఎం కేసీఆర్ కామెంట్స్
అవార్డులు ఒట్టిగనే వచ్చినయా?
ప్రగతిలో దేశవ్యాప్తంగా పది గ్రామాలకు అవార్డులిస్తే…ఇందులో ఒకటి నుంచి పది తెలంగాణలోనే ఉన్నయి. ఒట్టిగనే వచ్చినయా? ఎంతో ముందుచూపుతో పనిచేస్తేనే కదా.. సాధ్యమైంది. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు గెలిచినం. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పల్లె,పట్టణ ప్రగతి చేపట్టినం. మొక్కలు పెంచకపోతే టీఆర్ఎస్ సర్పంచైనా తీసేస్తామని చెప్పినం. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో చాలా అద్భుతాలు సాధించినం.
అనుక్షణం కాపలాదారులం
తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం పుట్టిందే టీఆర్ఎస్. ఇక్కడివారి ఉనికి, హక్కుల కోసం బరితెగించి పోరాడుతాం. వెయ్యికోట్ల ఆస్తి ఉన్న టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల సొంతం. రాజధాని, జిల్లా కార్యాలయాల్లో అద్భుతమైన కార్యాలయాలు కలిగివున్న పార్టీ. ఇవన్నీ తెలంగాణ ప్రజల ఆస్తిపాస్తులు. తెలంగాణవాసులకు అనుక్షణం కాపలాదారుగా ఉంటాం. వెన్నంటి కాపాడుకుంటాం.
మంత్రి కేటీఆర్ కామెంట్స్
బంగారు తెలంగాణ మోడల్..
ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి గుజరాత్ గోల్మాల్ మోడల్, బుల్డోజర్, డబుల్ ఇంజిన్లు వద్దు… బంగారు తెలంగాణ మోడల్ కావాలి. ఏడున్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ విజయాలు సాధిస్తే, ప్రధానిగా మోదీ వైఫల్యాలు మూటగట్టుకున్నారు.‘మేరా భారత్ మహాన్’ను నిజం చేయగలిగేది సీఎం కేసీఆరే.
సోచో ఇండియా..
జాతీయ వాదం అంటూ జాతి సంపద అయిన హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎల్ఐసీని మోదీ అమ్ముతున్నాడు. నవరత్నాలను తనకు ఇష్టమైన ఇద్దరు రత్నాలకు ఇచ్చేందుకు తహతహలాడుతున్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఫిట్ ఇండియా వంటి నినాదాలు ఇచ్చిన మోదీ.. ఇప్పడు బేచో ఇండియా అంటున్నాడు. కాబట్టి సోచోఇండియా అని నేను పిలుపునిస్తున్నాను.
సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్ రచించిన ఆరోహణ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్ తదితరులు