వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 06: హెచ్సీయూ కంచగచ్చిబౌలి తరహా ఘటన రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో (Agriculture University)లో చోటుచేసుకున్నది. వనమహోత్సవం (Vana Mahotsavam) పేరుతో జేసీబీలతో భారీ వృక్షాలను ప్రభుత్వ తొలగిస్తున్నది. శనివారం అర్ధరాత్రి సుమారు 20 జేసీబీలు, ప్రొక్రైనర్లతో వర్సిటీకి చేరుకున్న అధికారులు విలువైన చెట్లు, సహజసిద్దంగా పెరిగిన అటవీ సంపదను భూస్థాపితం చేస్తున్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం సందర్భంగా ఈ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. రాత్రికి రాత్రి జేసీబీ, హిటాచీ వంటి భారీ యంత్రాలతో ఆ ప్రాంతంలోని మొక్కలను చెట్లను నేలమట్టం చేశారు. విషయం తెలుకున్న విద్యార్థి సంఘాల నాయకులు శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. భారీగా అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. వారిని హాస్టల్ గదుల్లో నిర్బంధించారు.
క్యాంపస్లో భారీగా పోలీసులు మోహరించడంతో ఆ ప్రాంతమంతా నిషేధ ప్రాంతంగా తలపిస్తుంది. విద్యార్థులు వస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడానికైనా సిద్ధమేనని పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం. తొలగించిన చెట్లను ఎప్పటికప్పుడు లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం విలువైన మొక్కలు కాకుండా బ్యాంబూ వంటి మొక్కలను తొలగించి ఆ ప్రాంతంలో వన మహోత్సవ కార్యక్రమం చేపడుతున్నామని వివరణ ఇచ్చారు. కాగా, ఇప్పటికే హైకోర్టు నిర్మాణానికి వర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని తీసుకున్న ప్రభుత్వం తాజాగా, వనమహోత్సవం అంటూ ఉన్న చెట్లను నరికివేస్తూ 20 ఎకరాలను చదును చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం జరుగనున్న సీఎం కార్యక్రమాన్ని అడ్డుకుంటామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.
బ్రేకింగ్ న్యూస్
రాష్ట్రంలో HCU కంచ గచ్చిబౌలి తరహాలో మరో ఘటన
రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి ఉద్రిక్తత
బొటానికల్ గార్డెన్స్ లో భారీ వృక్షాలను తొలగిస్తున్న ప్రభుత్వం
20 జేసీబీల సహాయంతో వృక్షాల తొలగింపు
వృక్షాల తొలగింపు అడ్డుకున్న విద్యార్థులు.. వృక్షో రక్షతి… pic.twitter.com/h688xQLk3V
— Telugu Scribe (@TeluguScribe) July 6, 2025