సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో పేరుకుపోయిన కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్) శుద్ధి మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదివారం వెల్లడించారు. రూ. 250 కోట్లతో రాంకీ సంస్థ చేపట్టిన రెండు ఎంఎల్డీ సామర్థ్యంతో చేపట్టిన శుద్ధి కేంద్రం పూర్తి స్థాయి వినియోగంలోకి వచ్చిందన్నారు.కాగా.. జవహర్‌నగర్‌లో రూ.140 కోట్లతో క్యాపింగ్ పనులు పూర్తి చేయగా..కొత్తగా లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి మరో ఆధునిక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
నగరంలో వెలువడుతున్న చెత్తను జవహర్‌నగర్‌లో డంప్ చేస్తున్నారు. 14 మిలియన్ టన్నుల చెత్త అక్కడ గుట్టగా పేరుకుపోయింది. దాని నుంచి వెలువడుతోన్న లీచెట్ డంపింగ్ యార్డు ఆవరణలోని కుంటలో పేరుకుపోతున్నది. వర్షాకాలంలో చెత్త కుప్ప నుంచి ద్రవ్య వ్యర్థాలు ఎక్కువగా వెలువడుతుండటంతో కుంటలు పొంగి సమీపంలోని జలాశయాలు, భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంతాల ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం చొరవ తీసుకుని లీచెట్ పొంగిపొర్లకుండా శుద్ధి ప్రారంభించారు. మొబైల్ రిసోర్స్అస్మోసిస్ (ఆర్ఓ) ప్లాంట్ ఏర్పాటు చేసి ప్లేట్ అండ్ ట్యూబ్-అడ్వాన్స్డ్ రివర్స్ అస్మోసిస్ మెంబ్రేన్ సిస్టం ద్వారా లీచెట్ శుద్ధి చేస్తున్నారు. కుంటల్లో లీచెట్ లేకుండా పూర్తి స్థాయి స్వచ్ఛమైన నీరు ఉండేలా చేయాలన్న లక్ష్యంతో శుద్ధి జరుగుతున్నది. తద్వారా మల్కారం చెరువులో నీరు స్వచ్ఛంగా మారుతున్నది.
సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో పితామహుడుగా పేరొందిన ఎఫ్ సీ కొహ్లి జయంతిని పురస్కరించుకొని గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలు ఎఫ్ సీ కొహ్లి డేను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఐటీ రంగంలోని నిపుణులతో కీలక అంశాలపై ప్రత్యేకంగా ఉపన్యాసాలు ఉంటాయని పేర్కొన్నారు. మొదటి కీలక ప్రసంగాన్ని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నిపుణులు ప్రొఫెసర్ సుబ్బారావు, టీసీఎస్, మ్యాథ్ వర్క్స్ కంపెనీలకు చెందిన ఐటీ నిపుణులు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో కొహ్లీ సెంటర్ ఆన్ ఇంటెలిజెన్స్ సిస్టం పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.