సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ( HMDA) పరిధిలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలో(Urban Forest Division) బదిలీలు చేపట్టారు. అటవీ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి విధులు నిర్వహిస్తున్న వివిధ హోదాల్లో ఉన్న అధికారులు బదిలీ (Transfers) చేసినట్లు అధికారులు తెలిపారు. ఔటర్ రింగు రోడ్డుతో పాటు నగరంలోని హుస్సేన్‌సాగర్, పలు పార్కులు, నగర శివారు ప్రాంతాల్లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కులను విజయవంతంగా చేపట్టడంలో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేశారు.
హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు 158 కి.మీ పొడవునా పచ్చదనం పెంపొందించేందుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ, పచ్చదనం ఉండేలా నిర్వహణను అర్బన్ ఫారెస్ట్రీ విభాగం చేపట్టింది. చాలా ఏళ్లుగా డిప్యుటేషన్‌పై ఉన్న అటవీ శాఖ అధికారులను బదిలీ చేసినట్లు ఆదేశాలు వచ్చినా, ఎన్నికల కోడల్ అమల్లో ఉండడంతో బదిలీ అంశాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. కాగా అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలో పనిచేసిన అధికారులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడికి బదిలీ చేసినా వెళతామని పేర్కొంటున్నారు.