సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్ల పునరుద్ధ్దరణ..
రైల్వే ఆస్తుల లెక్కలు, నష్టంపై దృష్టి
స్టేషన్‌కు భారీ భద్రత..
మారేడ్‌పల్లి, జూన్ 18: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం జరిగిన ఆందోళనలు, నిరసనలతో ధ్వంసమైన ఆస్తుల లెక్కలు, రైళ్ల పునరుద్ధరణ, ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించిన అధికారులు.. అవసరమైన చర్యలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం నుంచి కొన్ని రైళ్ల రాకపోకలు పునరుద్ధరించగా.. శనివారం ఉదయం నుంచి పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో స్టేషన్ రద్దీగా మారింది. రైల్వే పార్సిల్ బోగీల్లో కాలిపోయిన వస్తువుల నష్టంతో పాటు, ఇంజిన్లు, బోగీల దహనానికి సంబంధించిన నష్టాన్ని రైల్వే డీఆర్ఎం ఏకే. గుప్తా నిర్ధారించారు. మరోవైపు రైల్వే పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ట్రైన్ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు ఉంటేనే లోపలికి అనుమతించారు.
మరమ్మతులు ప్రారంభం..
ధ్వంసమైన రైల్వే ఆస్తుల మరమ్మతులు ప్రారంభించారు. ఫ్యాన్స్, ట్యూబ్‌లైట్లు, తాగునీటి నల్లాలు కొత్తవి బిగించారు. మరమ్మతులు చేసి నిర్వాహకులు స్టాల్స్‌లను ఓపెన్ చేశారు.
రైళ్లన్నీ యథావిధిగా నడుస్తున్నాయి
రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా తెలిపారు. ప్రత్యక్షంగా రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. స్టేషన్లో 30 కోచ్‌లు, 5 రైలు ఇంజిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో పాటు వివిధ ఫ్లాట్‌ఫాంలపై ఉన్న సీసీ కెమెరాలు, టీవీలు, ఫ్యాన్లు, తినుబండరాల స్టాళ్లు, పార్సిళ్లకు పూర్తిగా నష్టం వాటిల్లిందని, 8 మంది రైల్వే సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని వివరించారు.
సుమోటోగా కేసు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించింది. జూలై 20వ తేదీలోగా పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ఆర్పీఎఫ్, జీఆర్పీ డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది.