సుశిక్షిత సిబ్బంది.. అత్యుత్తమ సౌకర్యాలు.. ఆధునిక పరికరాలు.. ఆహ్లాదరకరమైన వాతావరణం.. ఇలా ప్రభుత్వ వైద్యశాలలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. కాలంతో పోటీ పడుతూ.. కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు అందిస్తున్నాయి. ఇటీవలే నిమ్స్‌లో రోబోటిక్ శస్త్రచికిత్స అందుబాటులోకి రాగా, తాజాగా ఎంఎన్జేలో రూ.32 కోట్లతో ఏర్పాటు చేసిన రోబోటిక్ యంత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే.. క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన శస్త్రచికిత్సలు చేయవచ్చు. కాగా, రోబోటిక్ సర్జరీలు చేసేందుకు 20 మంది వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్‌కే పరిమితమైన రోబో సేవలను తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్‌లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శిక్షణ పొందిన వైద్య బృందం ఇటీవలే రోబో ద్వారా సర్జరీలు చేయడం ప్రారంభించింది. తాజాగా ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌కు సైతం రోబో వచ్చేసింది. ఇప్పటికే అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 7మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రాగా, రోబో థియేటర్ సైతం సిద్ధమైంది. దీంతో తెలంగాణలోని ప్రభుత్వ రంగ దవాఖానల్లో ఇక నుంచి రోబో శస్త్రచికిత్సల సంఖ్య మరింత పెరగనున్నది. దీని వల్ల నిరుపేద రోగులకు కార్పొరేట్‌ను తలదన్నే వైద్యం అందనున్నది.
పెరగనున్న మేజర్ సర్జరీలు
ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రస్తుతం ప్రతి రోజూ 8నుంచి 10 శస్త్రచికిత్సలు జరుగుతుండగా వాటిలో ఒకటి లేదా రెండు మేజర్ సర్జరీలు చేస్తున్నారు. రోబో అందుబాటులోకి వస్తే మేజర్ సర్జరీల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం రోజుకు ఒకటి రెండు ప్రధాన శస్త్రచికిత్సలు చేస్తుండగా, రోబో అందుబాటులోకి వస్తే..నాలుగైదు మేజర్ సర్జరీలు చేసే వీలుంటుంది. దీని వల్ల పెద్ద ఆపరేషన్ల కోసం వేచి చూసే రోగులకు నిరీక్షణ కాలం తప్పుతుంది. శస్త్రచికిత్సల సంఖ్య కూడా రోజూ 10 నుంచి 20 వరకు జరిగే అవకాశాలుంటాయని, దీని వల్ల క్యాన్సర్ సర్జరీలు మరింత వేగవంతంగా చేయవచ్చని వైద్యులు తెలిపారు. రోబో ద్వారా క్యాన్సర్ రోగులకు క్లిష్టమైన సర్జరీలను సులువుగా చేయవచ్చంటున్నారు.
రోబో ప్రత్యేకతలు
రోబోతో ఎలాంటి కోత లేకుండానే చిన్నపాటి రంధ్రం ద్వారా ఎంతటి పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ రోగులకు సాధారణ పద్ధతిలో శస్త్రచికిత్స చేయడం కొంత క్లిష్టమైనదే కాకుండా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదే రోబోతో అయితే సులువుగా చేయవచ్చు. పొట్ట, ఛాతీ, లివర్ తదితర భాగాల్లో ఎంతటి క్లిష్టమైన సర్జరీలనైనా సులభంగా జరపవచ్చు. రోబో సులువుగా 360 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. క్లిష్టమైన సర్జరీలు సులువుగా చేయవచ్చు. కడుపునకు సంబంధించిన అన్ని రకాల సర్జరీలు అంటే గాల్ బ్లాడర్, క్లోమంలోని చిన్న, పెద్ద పేగులు, కిడ్నీ, రెక్టమ్ తదితర శస్త్రచికిత్సలను కూడా ఈ రోబో ద్వారా చేయవచ్చు.
మేజర్ సర్జరీలు సులభంగా..
ఎంఎన్జేలో మూడు నెలల కిందట మాడ్యులర్ థియేటర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇక్కడ గతంలో కంటే శస్త్రచికిత్సల సంఖ్య పెరిగింది. ప్రతి రోజు 8 నుంచి 10 సర్జరీలు చేస్తున్నాం. అందులో ఒకటి రెండు మేజర్ శస్త్ర చికిత్సలు ఉంటున్నాయి. వారం కిందటే రోబో కూడా వచ్చేసింది. ఇది కూడా నిమ్స్ తరహా ఆధునిక రోబోనే కావడంతో క్లిష్టమైన సర్జరీలను సులభంగా చేయవచ్చు. రోబో వల్ల మేజర్ సర్జరీల సంఖ్య పెరుగుతుంది. ప్రతి రోజు నాలుగైదు మేజర్ సర్జరీలు చేయవచ్చు. రోజుకు 10నుంచి 15 ఆపరేషన్లు చేసే వీలుంటుంది. రోబో ద్వారా శస్త్రచికిత్సలు చేయడానికి 20 మంది సర్జన్లకు శిక్షణ ఇప్పిస్తున్నాం.
-డాక్టర్ జయలత, డైరెక్టర్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్