సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ 1వ తేదీ నుంచి వార్డు పరిపాలన చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సమస్యల సత్వర పరిషారానికి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 150 వార్డులలో 10 మంది అధికారుల బృందంతో వార్డు పాలన వ్యవస్థ మొదలవుతుందన్నారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నం.12 వార్డు నం.93 సిటీ మేనేజర్ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న వార్డు ఆఫీస్‌ను మేయర్ పరిశీలించారు. నగర పౌరులకు అతి సమీపంలో వార్డు ఆఫీస్‌లను ఏర్పాటు చేసి అందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వార్డు ఎంటమాలజిస్ట్, వార్డు ఇంజినీర్, వార్డు టౌన్ ప్లానర్, వార్డు కమ్యునిటీ ఆర్గనైజర్, వార్డు శానిటరీ జవాన్, వార్డు అర్బన్ బయోడైవర్సిటీ సూపర్ వైజర్, వార్డు కంప్యూటర్ ఆపరేటర్, వార్డు రిసెప్షనిస్ట్, జలమండలి అధికారులు, టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. ఈ నెల 25, 26 తేదీలలో వార్డు ఆఫీస్‌లను సకల సదుపాయాలతో సిద్ధం చేస్తున్నారని చెప్పారు.
ఈ నెల 31న వార్డు కార్యాలయాన్ని ప్రారంభించి పౌరులకు వార్డు సేవలను అందించనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా పౌర సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిషరించడానికి వార్డు ఆఫీస్‌లు పనిచేయనున్నాయని తెలిపారు. వార్డు కార్యాలయం పేర్లను తెలిపే బోర్డులను ప్రజలందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. వార్డు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర పని చేయనున్నారు. జూబ్లీహిల్స్ సరిల్లో నాలుగు వార్డులను ఏర్పాటు చేస్తున్నారని, ఇందులో వార్డు నం.92 వెంకటేశ్వర కాలనీలో, వార్డు నం.94 షేక్ పేట్, వార్డు నం.95 జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేస్తున్నారని మేయర్ తెలిపారు.
నేడు వార్డు కార్యాలయాల ఆఫీసర్లకు శిక్షణ
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వార్డు కార్యాలయాల ఆఫీసర్లకు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు శిక్షణ గురువారం ఇవ్వనున్నారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్కుమార్ల సమక్షంలో ఈ శిక్షణ తరగతులను ప్రధాన కార్యాలయంలో ఏడవ అంతస్తులో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పౌరులు అందించిన ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం మార్గాలపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు.