సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడంతో భాగంగా యాజమాన్యం అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఒక పక్క నగర ప్రయాణికులను ఆకర్షించే పథకాలు ప్రారంభిస్తూనే మరో పక్క డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, సెక్యూరిటీ వారు తమ విధులు ఎమిటీ.. ఎలా వ్యవహరించాలి? వంటిపైనా దృష్టి పెట్టింది. డ్రైవర్ల నిర్లక్ష్యం, మానసిక పరిస్థితుల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుకుండా చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ జాబ్ అయినప్పటికీ ఓపికగా ఉండడం ఎలా? వంటి విషయాలపై సిటీలో పని చేస్తున్న డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏదో సాధారణంగా కాకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరికరంతో డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. చోలా ఎంఎస్ అనే కంపెనీ ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. రాత్రి మద్యం తాగిన డ్రైవర్ ఉదయం డ్యూటీకి వచ్చే క్రమంలో డ్రైవర్ ఎలా వ్యవహరించాలి ? ప్రత్యేకంగా రూపొందిన పరికరం ద్వారా శిక్షణ ఇస్తున్నారు. మద్యం తీసుకున్న తర్వాత.. విధుల్లోకి వచ్చే సమయంలో డ్రైవర్ మానసిక పరిస్థితులు, కుటుంబ తగాదాలు వల్ల కలిగే ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకోడం కోసం చోలా ఎంఎస్ కంపెనీ కొన్ని పరికాలను ఏర్పాటు చేసింది. ఈ పరికరాల సహాయంతో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలు సికింద్రాబాద్లోని ఆర్టీసీ గ్రేటర్ జోన్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం కలిపి ప్రతి రోజు వంద మంది డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ ప్రాంతీయ అధికారి సీహెచ్ వెంకన్న తెలిపారు.
డ్రైవర్లు, కండక్టర్లకు వేర్వేరుగా శిక్షణ..
ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు, కండక్టర్లకు, మెకానికల్, సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆఫీస్ సిబ్బందికి కలిపి ఒకే సారి శిక్షణ ఇచ్చారు. అయితే దీని వల్ల మంచి ఫలితాలు రావడం లేదని భావించిన ఆర్టీసీ యాజమాన్యాలు వేర్వేరుగానే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. చోలా ఎంఎస్ అనే కంపెనీతో శిక్షణ ఇవ్వడం కోసం ఆ సంస్థతో ఆర్టీసీ యాజమాన్యం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్ రీజన్లలో కలిపి మొత్తం 6500 డ్రైవర్లకు శిక్షణ కొనసాగుతుందన్నారు. అలాగే 7000 మంది కండక్టర్లకు శిక్షణ ఇస్తున్నారు. 2000 మంది మెకానికల్, 500 మంది సెక్యూరిటీతో పాటు డిపోల వారీగా ఉన్న దాదాపు 300 పైగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. దీంతో సత్ఫలితాలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.
ఆర్థిక సంస్థలతో కండక్టర్లకు శిక్షణ..
సిటీ బస్సులు ఎక్కే ప్రయాణికులతో కండక్టర్ ఎలా మసులుకోవాలి? టికెట్ ఇచ్చే క్రమంలో ఎలా సౌమ్యంగా ఉండాలి? రకరకాల ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలి? ఎలా మర్యాదగా మాట్లాడాలి ? దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను ఎలా ఎదుర్కోవాలి అనే కోణంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు గ్రేటర్ జోన్ అధికారులు తెలిపారు.