సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ) : గంట కాదు.. రెండు గంటలు కాదు.. మంగళవారం ఏకంగా ఆరు గంటల పాటు నగర ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిలలాడారు. కోఠిలో ఆశ వర్కర్లు ధర్నాకు దిగడంతో ఆ ప్రభావం సగం నగరం పై పడింది. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకొని బిక్కు బిక్కుమంటూ ఆగిపోయారు.
ఆశ వర్కర్లు ధర్నా చేయడానికి వస్తున్నారనే విషయం తెలిసినా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఏ మాత్రం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే వాహనదారులు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నగరంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందంటూ బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ట్రాఫిక్ నిద్రావస్తలో ఉందని చెప్పడానికి ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనమని నగర వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా రూట్లలో అలర్ట్ చేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు వెళ్లాలంటూ సూచనలు ఇవ్వాల్సిన ట్రాఫిక్ పోలీసులే ఆ విషయాన్నే విస్మరించారు. దీంతో మంగళవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోఠి చుట్టు పక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.