సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు నగర పోలీసులు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టాన్ని పక్కాగా ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ (పీఏఎస్)లో తాజాగా సైబర్ నేరాలను అడ్డుకోవడంపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. నగరంలో 55 కూడళ్లలో పీఏఎస్లను ఏర్పాటు చేశారు. 10 ఏండ్ల కిందట హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పీఏఎస్తో ఒక పక్క ట్రాఫిక్ మరో పక్క శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి వివరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సైబర్‌నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎన్నో అవగాహన కార్యక్రమాలను పోలీసులు నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థలు, బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కాలనీలు, బస్తీలతో పాటు ప్రార్థనా కేంద్రాల వద్ద కూడా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పీఏఎస్ను కూడా ఉపయోగిస్తున్నారు.
1930కు ఫోన్ చేయండి..
అత్యాశ, అమాయకత్వం, ఆందోళన నేపథ్యంలోనే ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతుంటాయి. ఈ నేరాలను అప్రమత్తతతోనే 90 శాతం అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది. అయినా, మోసపూరితమైన ఫోన్‌కాల్స్, బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు అపహరణ, మాయ మాటలతో బోల్తా కొట్టించి ఆర్థికంగా నష్టం కలిగించే సైబర్‌నేరగాళ్ల బారిన పడినవారు వెంటనే 1930కు ఫోన్ చేయాలని, cyber crime.gov.in వెబ్సైట్లోనైనా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు ఇతర ఖాతాలకు బదిలీ అయిన వెంటనే బాధితులు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. ఆ డబ్బును ఆయా ఖాతాల్లోనే స్తంభింప చేసేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బాధితులు ఎంత త్వరగా స్పందిస్తే అంత మేరకు బాధితులకు పోయిన డబ్బు వచ్చేందుకు అవకాశం ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.