బడికి, ఇంటికి వెళ్లే సమయాల్లో రోడ్లన్నీ గజిబిజి
పాఠశాలల సమీపంలో ట్రాఫిక్ సమస్య
రోడ్లు దాటడంపై అవగాహన లేక ప్రమాదాలు
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలంటున్న నిపుణులు
అది బంజారాహిల్స్‌లోని ఒక అపార్ట్మెంట్. అందులో బడికి వెళ్లే పిల్లలు ఆరుగురు. ముగ్గురు ఒకే స్కూల్లో చదివేవారే. అయితే వీరంతా స్కూల్‌కు వెళ్లాలంటే వారి వారి కార్లల్లో వెళుతారు. అంటే మొత్తంగా ఆరు కార్లు ఒకే సమయంలో రోడ్డు మీదకొస్తాయి. ఆ విద్యార్థులందరినీ ఒకే కారులో తీసుకెళ్లే బాధ్యత వారు తీసుకుంటే ట్రాఫిక్ కట్టడికి కొంతైనా ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
అది సికింద్రాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్. బడి తెరిచే సమయం, ఇంటికి వెళ్లే సమయాల్లో ఆ ప్రాంతం అంతా వందల వాహనాలతో రద్దీని తలపిస్తుంది. పిల్లలను తీసుకువెళ్లడానికి వచ్చే తల్లిదండ్రులతో పాటు ఆ రోడ్ల గుండా వెళ్లే వాహనదారులతో ఆ ప్రాంతం నరకమయంగా మారుతుంది. అది స్కూల్ అని తెలిసే సూచీ బోర్డులు కూడా లేకపోవడంతో వాహనాల వేగం కూడా తగ్గదు. ఫలితంగా చిన్నారులు ప్రమాదాల బారినపడుతున్నారు. రోడ్లు దాటే సమయాల్లో కూడా ఎలా వెళ్లాలో అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. కార్లు ఎడమ డోరు గుండా దిగక కొందరు పిల్లలు కుడివైపున డోర్స్ తీసి ప్రమాదాలబారినపడుతున్నారు.. ఇది నగరంలోని అన్ని స్కూల్స్ వద్ద ఉన్న పరిస్థితి.
సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : అకడమిక్ పాఠాలతో పాటు ట్రాఫిక్ పాఠాలు కూడా విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఉపాధ్యాయులతో పాటు పాఠశాలలో పని చేసే సిబ్బంది, విద్యార్థులు, తల్లిండ్రుల అందరికీ ట్రాఫిక్ నియమాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలని రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. పాఠశాలలు తెరుచుకోవడంతో సంబంధిత ప్రాంతాలు అత్యధికంగా ట్రాఫిక్ జామ్‌గా మారుతున్నాయి. పిల్లలు బడికి వెళ్లే సమయం, లంచ్, ఇంటికి వెళ్లే సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు బారులు తీరడం.. హారన్ల మోత.. ఎటు వెళ్లాలో తెలియక నిరీక్షణ తదితర పరిస్థితులు దాపురిస్తున్నాయి. స్కూల్స్ ముందర నుంచి వెళ్లే వాహనాలు వేగంగా రావడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్ యాజమాన్యాలు పిల్లల భద్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని విద్యానిపుణులు, పేరేంట్స్ అసోసియేషన్స్ విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఆ సమయాలు రద్దీ మార్గాలు..!!
గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో సుమారు 5700 ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు రద్దీ మార్గాల్లోనే స్కూల్స్ కొలువుదీరాయి. పిల్లలను పాఠశాలల్లో వదిలిపెట్టడానికి తల్లిదండ్రులు సొంత వాహనాలు, ఆటో, విద్యాసంస్థల బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఒకే సమయానికి స్కూల్స్ అన్ని ప్రారంభం.. భోజన సమయాలు, ఇంటికి వెళ్లే సమయాలు దగ్గరదగ్గరగానే ఉండటం కూడా హెవీ ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అధికారులు ట్రాఫిక్ పాఠాలపై అవగాహన కల్పించాలని యాజమాన్యాలు లేఖలు రాసినట్టు సమాచారం. ప్రతీ స్కూల్ దగ్గరా సైన్‌బోర్డులు, ట్రాఫిక్ నిబందనలు సూచికలను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులు కోరారు. ప్రమాదకరంగా ఉన్న రోడ్ల వద్ద కొనసాగుతున్న పాఠశాలలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తొలుత ఇలాంటి పాఠశాలలను గుర్తించి రవాణాశాఖ ఒక నివేదికను రూపొందించనుంది.
యాజమాన్యాలు జరసోచో..
ట్రాఫిక్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం యాజమాన్యాలు బాధ్యతగా తీసుకోవాలని సామాజికవేత్తలు చెబుతున్నారు. సూచీ బోర్డులు ఏర్పాటు చేయని వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను కోరుతున్నారు. బడి ముందు జీబ్రా క్రాసింగ్ ఉండాలి. స్కూల్ జోన్‌గా పేర్కొంటూ పాఠశాలలకు వంద మీటర్ల ముందు తప్పనిసరిగా సైన్‌బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పాఠశాలల నిబంధనల్లో ఉంది. వాహనాలను తక్కువ వేగంతో వెళ్లాలనే సూచించే బోర్డులు పెట్టాలి.
పాఠశాలల విడిచే ముందర ఒకేసారి అంతా రహదారికి రాకుండా స్కూలు యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫిట్‌నెస్‌లేని వాహనాలు నడుపొద్దు
పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ట్రాఫిక్ సిగ్నళ్లపై అవగాహన ఉండాలి. పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి. స్కూల్స్ పక్కన ఇష్టానుసారంగా ఆటోలు, వాహనాలు నిలుపకూడదు. ఫిట్‌నెస్‌లేని వాహనాల్లో పిల్లలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న యాజమాన్యాలు, డ్రైవర్లను జైలు కూడా పంపిస్తాం.
– శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీవో, సికింద్రాబాద్
పిల్లలకు ట్రాఫిక్ పాఠాలు
పరిమితికి మించి పిల్లలను వాహనాల్లో ఎక్కించుకోవద్దు. చిన్నారుల భద్రతకు సంబంధించి పాఠశాల యాజమాన్యాలు సీరియస్‌గా ఉండాలి. పిల్లలను తీసుకొచ్చే వాహనాలు కండీషన్లో ఉన్నాయా? లేదా పరిశీలించాలి. డ్రైవింగ్‌లో ఎక్స్‌పర్ట్‌గా ఉన్నవారిని డ్రైవర్‌గా నియమించుకోవడం ఉత్తమం. పాఠశాలల వద్ద పిల్లలు బస్సు దిగే సమయంలో ఎలా దిగాలో.. ఎలా ఎక్కాలో అవగాహన కల్పించాలి. ఎమర్జెన్సీ డోర్ వినియోగం వారికి తెలిసేలా చూడాలి.
– రవీందర్ కుమార్, ఆర్టీవో, ఉప్పల్
ట్రాఫిక్‌కు కట్టడి ఇలా..