హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం ఉదయం అంబేద్కర్ వై జంక్షన్, ఐడీఎల్ జంక్షన్, జేఎన్టీయూ, నిజాంపేట్, అల్విన్ ఎక్స్‌రోడ్, చందానగర్ మీదుగా యాత్ర కొనసాగుతుందని తెలిపారు. యాత్ర జరిగే సమయాలలో ఆయా జంక్షన్ల వైపు సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించకుండా, ఇతర మార్గాలలో మళ్లిస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని డీసీపీ కోరారు.