హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం హైదరాబాద్‌లో కొనసాగనుంది. హైదరాబాద్ పరిధిలో 8 కిలోమీటర్ల పొడవునా రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్, ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. పురానాపూల్, ముసబౌలి, లాడ్ బజార్, చార్మినార్ మీదుగా రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. దీంతో సౌత్ జోన్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
చార్మినార్ నుంచి అఫ్జల్ గంజ్, మోజాం జాహీ మార్కెట్, గాంధీ భవన్, పోలీసు కంట్రోల్ రూమ్, రవీంద్ర భారతి, ఆర్బీఐ, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. రాత్రి 8:30 గంటల సమయంలో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. పాదయాత్ర జరిగే మూడు కిలో మీటర్ల రేడియస్‌లో ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని వాహనదారులకు సూచించారు. ఆర్టీసీ బస్సులను సైతం డైవర్ట్ చేస్తున్నాం, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగించాలని సూచించారు.