Traffic Restrictions | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని( Ambedkar Statue ) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, మింట్ కంపౌండ్ మార్గాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
-నెక్లెస్ రోడ్డు, కొత్త సచివాలయం రోడ్డు వైపు వచ్చే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లించనున్నారు. వీవీ విగ్రహాం(ఖైరతాబాద్), ఓల్డ్ సైఫాబాద్ పోలీసు స్టేషన్ జంక్షన్, రవీంద్ర భారతీ జంక్షన్, మింట్ కంపౌండ్ రోడ్డు, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్ట మైసమ్మ టెంపుల్(లోయర్ ట్యాంక్ బండ్), ట్యాంక్ బండ్, లిబర్టీ జంక్షన్ వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు హాజరయ్యే జనాలతో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
-అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను ట్యాంక్‌బండ్ వైపునకు అనుమతించరు. ఈ మార్గంలో వచ్చే ఆర్టీసీ బస్సులను రవీంద్ర భారతి, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్ట మైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మార్గాల్లో అనుమతించనున్నారు.
-ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా ప్రయాణికులు, వాహనదారులు ఈ మార్గాల్లో ప్రయాణించకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.