హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నగరంలో తిరుగుతున్న ఆటోలను కట్టడి చేయడానికి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ (Special Drive) చేపట్టారు. హైదరాబాద్ పరిధిలో రిజిస్ట్రేషన్ జరిగిన ఆటోలకు మాత్రమే నగరంలో తిరిగేందుకు అనుమతి ఉంది. అయితే తెలంగాణ, ఏపీల నుంచి కొనుగోలు చేసిన ఆటోలు రాజధానిలో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ రద్దీ, కాలుష్య అధికమవుతున్నది. కాగా, హైదరాబాద్ జిల్లా రవాణాశాఖ లెక్కల ప్రకారం 1.50 లక్షల ఆటోలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే రోడ్లపై మాత్రం వాటి సంఖ్య మూడు లక్షలు దాటింది.
ఈనేపథ్యంలో ఇలాంటి ఆటోలను కట్టడి చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆటో డ్రైవర్లు, సంఘాలకు అవగాహన కల్పించారు. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, యూనిఫాం తప్పనిసరిగా ఉండాలని ఆటోడ్రైవర్లకు సూచించారు. టీఎస్ లేదా ఏపీ 9-13లతో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలను మాత్రమే నగరంలోకి అనుమతించనున్నారు.