చినుకు పడిందా నగరంలో నరకం కనిపిస్తున్నది. వానలో తడుస్తూ, పొగ కాలుష్యాన్ని పీలుస్తూ గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సిందే. ఓ వైపు ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం, మరోవైపు బల్దియా అధికారుల, హైడ్రా సిబ్బంది నిర్వహణా లోపాల వల్ల నగర దారులకు వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం నగరానికి మణిహారంగా ఉన్న ఈ కమిషనరేట్ పరిధిలో వందల సంఖ్యలో ఐటీ కంపెనీలు,
రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు, బడా నిర్మాణ సంస్థలు, పలు ఇతర రకాల పారిశ్రామిక వాడలు ఉండడంతో నిరంతరం ఈ కమిషనరేట్ పరిధిలోని రోడ్లు వాహనదారులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ గచ్చిబౌలి, టీ-హబ్, మాదాపూర్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, హైటెక్‌సిటీ, మైండ్ స్పేస్ తదితర ప్రాంతాల్లోని రహదారులు నిత్యం రద్దీగానే ఉంటాయి. కాని వర్షాలు కురిసినప్పుడు మాత్రం ఈ సమస్య మరింత తీవ్రమవుతున్నది.
రోడ్లపై గంటల తరబడి తప్పని నరకయాతన: గత 3 మూడు రోజులుగా కురుస్తున్న వానలతో సైబరాబాద్ పరిధిలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుపోతున్నాయి. ఐటీ కారిడార్‌తో సహా కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, బాలానగర్, చింతల్, సుచిత్ర తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో గంటల తరబడి వాహనదారులు రోడ్లపై నిరీక్షించక తప్పడం లేదు. దీంతో పాటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ వాహనదారులకు ట్రాపిక్ కష్టాలు తప్పడం లేదు.
మాదాపూర్-జూబ్లీహిల్స్ రోడ్ నెం-45, జూబ్లీహిల్స్ రోడ్‌నెం-36, రోడ్‌నెంబర్-1, కేబీఆర్ పార్క్, బంజారాహిల్స్ రోడ్ నెం-12, రోడ్ నెంబర్-1, కృష్ణానగర్, నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు, పంజాగుట్ట నుంచి మాసబ్‌ట్యాంక్ వరకు, బేగంపేట, జూబ్లీ బస్టాంట్, అల్వాల్, అమీర్‌పేట, మైత్రీవనం, చాదర్‌ఘాట్, మలక్‌పేట, అఫ్జల్‌గంజ్, పురానాపూల్, నాంపల్లి, అబిడ్స్, మోజంజాహి మార్కెట్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పలు రకాల చర్యలు చేపడుతున్నట్లు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు చెప్పుకుంటున్నవన్నీ ఉత్త మాటలే అని ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఐటీ, ఇతర సంస్థల సహకారంతో ట్రాపిక్ వాలంటీర్లను నియమించారు. వారితో పాటు సీఎం సూచన మేరకు ట్రాన్స్జెండర్లను సైతం ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించిన విషయం తెలిసిందే. ఇది కాకుండా ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలతో కూడిన ట్రాఫిక్ బృందాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ట్రాఫిక్ జాం జరిగిన ప్రదేశానికి వెళ్లి, ట్రాఫిక్ అంతరాయానికి కారణమైన అవరోధాలను వెంటనే తొలగించి, లైన్ క్లియర్ చేస్తాయి.
దీంతో పాటు ఏ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఉందో తెలుసుకుని, ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా దానికి ప్రత్యమ్నాయ మార్గంలో వెళ్లేలా ముందస్తు సమాచారాన్ని పొందేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘ట్రాఫిక్ పల్స్’ వ్యవస్థను సైతం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ‘టాన్లా ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్’ సహకారంతో అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త వ్యవస్థ కూడా సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను అధిగమించలేకపోతుందని ప్రజలు వాపోతున్నారు. ఇన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదని మండిపడుతున్నారు వాహనదారులు.
కీలకమైన ట్రాఫిక్ జంక్షన్లు, అనధికార పార్కింగ్ హాట్స్పాట్లతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మరింత పకడ్బందీగా పర్యవేక్షించనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఇటీవల ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత అటువంటి దిశగా ఒక్క అడుగూ పడలేదని వారి ప్రకటనలు నీటిమీది రాతలుగానే మిగిలాయని వాహనదారులు మండిపడుతున్నారు.
అంతేకాకుండా బాటిల్ నెక్ (ఇరుకైన దారులు) పాయింట్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు డ్రోన్ వ్యూ సహకారం తీసుకుంటామని కూడా గతంలో పోలీసులు చెప్పారు. అది ఏ మేరకు అమలైందో ఎవరికీ తెలియని పరిస్థితి. సీసీ కెమెరాలతో ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ అంతరాయం ఏర్పడిందో వెంటనే గుర్తించడమే కాకుండా ట్రాఫిక్ జామ్‌కు కారణమైన అంశంపై వెంటనే స్పంధించి తగిన చర్యలు తీసుకుంటామని ఇటీవల అధికారులు చెప్పిన మాటలకు ప్రస్తుత పరిస్థితులకు పొంతన
సైబరాబాద్ రోడ్లంటేనే వాహనదారులు జంకుతున్నారు.
ఉద్యోగరీత్య తప్పనందున గత్యంతరం లేక ప్రతి రోజు గంటల తరబడి అక్కడి ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సైతం వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. మధ్యాహనం కురిసిన తేలికపాటి ముసురు వానకే ఐటీ కారిడర్ మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోయింది. దీంతో వాహనదారులు దాదాపు 2నుంచి 3గంటల వరకు రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. 10నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానాలకు గంట సమయం పట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోకపేట, నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ, మల్కం చెరువు, ఫిల్మ్‌నగర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్‌సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ రోడ్‌నెం 45 తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.