అత్యవసరమని కారు లేదా బైక్‌తో రోడ్డెక్కితే చాలు.. ట్రాఫిక్‌లో చిక్కుకోవడమే.. ఒక్కసారి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నామంటే గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాఫిక్ జామ్‌లతో నగరవాసులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. కీలక సమయాల్లో రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మహానగరంలో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. ఆఫీసుకు, అత్యవసర పనికి, స్కూల్, కాలేజీకి.. ఇలా ఏ అవసరం వచ్చి బయటకు వెళ్లాలన్నా..గంటల తరబడి రోడ్ల మీద గడపాల్సి వస్తున్నది. రెండేండ్లలో నగరంలో ట్రాఫిక్ నిర్వహణ మరీ అధ్వానంగా మారింది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి.. దేశంలో అత్యంత రద్దీ కలిగిన ఆరో నగరంగా అవతరించింది. ఈ ఏడాది సిటీలో వాహనాల సంఖ్య సుమారు 90 లక్షలకు చేరుకోవడంతో దేశంలో అత్యధిక వాహన డెన్సిటీ కలిగిన నగరంగా నిలిచింది. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పోలీసులు నిరంతరం కసరత్తు చేస్తున్నారు. ఆరేండ్లలో నగర రోడ్లపై వాహనాల సంఖ్య 40 శాతం పెరిగింది. 2019లో కిలోమీటర్‌కు 6500 వాహనాలుండగా, 2025లో కిలోమీటర్‌కు దాదాపు 9500 వాహనాల రాకపోకల డెన్సిటీ ఉంది. రోజుకు 1500 నుంచి 2 వేల కొత్తవాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. సిటీలోని మొత్తం వాహనాల్లో 63 లక్షల ద్విచక్రవాహనాలు, 16 లక్షల కార్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. కిలోమీటర్‌కు 2వేల కార్లు రోడ్డు మీదే ఉంటున్నాయి.
కనిపించని ట్రాఫిక్ సిబ్బంది..
రెండేండ్లుగా ట్రాఫిక్ నిర్వహణ పూర్తిగా అధ్వానంగా మారింది. గతంలో ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే సిబ్బందితో సహా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ట్రాఫిక్ సమస్య తొలగించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రధాన సెంటర్లలో తప్ప అసలు సిబ్బందే ఉండకపోగా.. అధికారులు కనిపించడమే మానేశారు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో తప్ప..ట్రాఫిక్ జామ్‌ల సమయంలో అధికారులే ఉండడం లేదు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ సెల్ఫోన్లతో ఫొటోలు తీయడం, రోడ్డుకు పక్కకు వెళ్లి నిల్చొని ముచ్చట్లు పెట్టడం తప్ప సీరియస్‌గా డ్యూటీ చేయడం లేదు. దీంతో ఫ్రీలెఫ్ట్ ఉన్న దగ్గర, సిగ్నల్ క్రాసింగ్ నివారించలేకపోతున్నారని వాహనదారులు అంటున్నారు.
రెండేండ్ల పాలనలో అస్తవ్యస్తం..
గత ప్రభుత్వంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ అధికారులు సమీక్షలు జరిపేవారు. నేడు ట్రాఫిక్‌పై సమీక్షలు లేవు.. సమన్వయ సమావేశాలు లేవు.. ప్రతిరోజూ రోడ్లపైకి భారీగా వాహనాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, లింకు రోడ్లు ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపారు. కానీ ఆ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల వద్ద నిర్వహణ సరిగా లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ పెరుగుతున్నదని వాహనదారులు వాపోతున్నారు. సికింద్రాబాద్ నుంచి బేగంపేట వైపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా జరుగుతున్నాయి. గతంలో ఇక్కడ ఎలాంటి రద్దీ లేకుండా ట్రాఫిక్ నిర్వహణ సక్రమంగా జరగడంతో రద్దీ లేకుండా సాఫీగా ప్రయాణం సాగేది. ఇక ఎల్బీనగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ హయాంలో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించి సిగ్నల్ లేని కూడలిగా తీర్చిదిద్దింది. రెండేండ్లుగా ఇక్కడ ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఈ చౌరస్తా గజిబిజిగా మారింది.
14 ట్రాఫిక్ హాట్‌స్పాట్స్ గుర్తింపు..
ఒక కిలోమీటర్ ప్రయాణించాలంటే సగటున ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతున్నది. ప్రధాన సెంటర్లలో ఇరవై నిముషాలు పడుతున్నదని వాహనదారులు వాపోతున్నారు. పది కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31 నిమిషాల 30 సెకన్లుగా ట్రాఫిక్ పోలీసులే చెబుతున్నారు. అయితే ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర వరకు.. సాయంత్రం ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకు పీక్ అవర్స్‌గా పరిగణిస్తారు. పంజాగుట్ట, బేగంపేట, మలక్‌పేట, చాదర్‌ఘాట్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్‌జామ్ అవుతూ గంటకు కిలోమీటర్ వేగాన్ని ఇంకా తగ్గిస్తోంది. అధికారులు ట్రై కమిషనరేట్ల పరిధిలో కీలకమైన 14 ట్రాఫిక్ హాట్‌స్పాట్స్‌ను గుర్తించారు. ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలు 160కి పైగా ఉన్నప్పటికీ ఈ 14స్పాట్స్‌లో ప్రతిరోజూ గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయని గుర్తించారు. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట, బేగంపేట, పంజాగుట్ట, సికింద్రాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, మెహదీపట్నం, మలక్‌పేట, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాలను హాట్ స్పాట్స్‌గా గుర్తించారు.

ట్రాఫిక్ రద్దీకి కారణాలు..
వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం, నిబంధనలు పాటించకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం, అధ్వానమైన రహదారులు, ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగకపోవడం వంటివి హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి కారణాలుగా చెప్పాలి.
సిటీలో వర్షాకాలంలో రోడ్లపై వరద ఆగుతుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నది. ఈ సమస్య ఎక్కువగా ఐటీ కారిడార్, ఓల్డ్‌సిటీ, పంజాగుట్ట, సోమాజిగూడ, బేగంపేట, అమీర్‌పేట, సికింద్రాబాద్, తార్నాక,కూకట్పల్లి,మలక్‌పేట్, చాదర్‌ఘాట్, దిల్సుఖ్నగర్ , ఉప్పల్, హబ్సిగూడలో ఎక్కువగా ఉంది.
రోడ్లకిరువైపులా వాహనాలు నిలపడం వల్ల కూడా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడుతున్నది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు, నగరంలోనూ ఈ సమస్య ఎక్కువగా ఉంది. కీలకమైన ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, దిల్సుఖ్నగర్, అబిడ్స్, తార్నాక, నారాయణగూడ, బంజారాహిల్స్, చాదర్‌ఘాట్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి మార్గాల్లో వేలాది వాహనాలు రోడ్లకు పక్కన నిలిపి ఉంచుతున్నారు.
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో రోజూ సగటున 20 వాహనాలు ఆయిల్ లేక, మరమ్మతులకు గురై ఫ్లై ఓవర్లపై, నడి రోడ్లపై మొరాయిస్తున్నాయి. దీంతో రద్దీ ప్రాంతాలు, పై వంతెనలపై వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్ సిబ్బందికి వాటిని తొలగించేందుకు సుమారు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి గంటలకొద్దీ సమయం పడుతుంది.
మియాపూర్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, లక్డీకాపూల్, అమీర్‌పేట, అబిడ్స్, కాచిగూడ, అత్తాపూర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మెహదీపట్నం, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో గంటల తరబడి ప్రైవేటు బస్సులు నిలబెట్టి ఉంచడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. మరోవైపు ప్రముఖుల వాహనాలు, ప్రొటోకాల్ అని చెప్పి తరచూ ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ పోలీసులు వేస్తున్న చలాన్లు, చేస్తున్న వాహన తనిఖీలు ఎక్కువగానే ఉన్నా వాహనదారులు మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్ వంటివి ట్రాఫిక్ జామ్ కావడానికి కారణమవుతున్నాయి. దీంతో వాహనాలు ముందుకు కదలక నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఐటీ కారిడార్‌లోని ప్రాంతాల నుంచి దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జి , ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వేగంగా ఆగకుండా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్. 45 చౌరస్తాలో ఒక్కసారిగా జామ్ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ పరిసరప్రాంతాల నుంచి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట, సికింద్రాబాద్‌ల వైపు వెళ్లాల్సిన వాహనాలు, ఫ్లైఓవర్ కింద నుంచి ఖైరతాబాద్ దిశగా వెళ్లాల్సిన వాహనాలు అన్నీ ఫ్లైఓవర్‌కు ముందు, పంజాగుట్ట చౌరస్తా వద్ద జామ్ అవుతున్నాయి. ఇలా నగరంలో చాలా ఫ్లైఓవర్లకు ముందు, చివర్లో ఇదే పరిస్థితి ఉంది.