సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): దసరా పండుగ సందర్భంగా ఊరెళ్తున్న ప్రయాణికులతో నగర రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఒకవైపు మూసీవరద ప్రభావంతో చాదర్‌ఘాట్ వద్ద రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతుంటే మరోవైపు రోడ్లపై గుంతలు నగరవాసికి నరకం చూపిస్తోంది. మంగళవారం కోఠి, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కోఠి నుంచి మలక్‌పేట వైపు వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చాదర్‌ఘాట్ మీదుగా మలక్‌పేటకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. కోఠి-దిల్సుఖ్నగర్ మార్గంలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు వరదలకు దెబ్బతిన్న చాదర్‌ఘాట్ పాత వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
దసరా పండుగ సందర్భంగా సెలవులు రావడంతో సొంతూర్లకు వెళ్లేవారు తమ సొంతవాహనాల్లో వెళ్తుండగా మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. నగరంలోను, నగరశివార్లలోను ట్రాఫిక్‌జామ్ కారణంగా వాహనాలు కదలడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట వరకు ట్రాఫిక్ జామ్ కాగా, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ వరకు ట్రాఫిక్ రద్దీ కొనసాగుతోంది.