సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో పగలే కాదు.. రాత్రి కూడా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. నగర ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రద్దీ సమస్య పరిష్కారానికి తూతూ మంత్రంగానే చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో 10 గంటల తరువాతే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి ఉన్నా.. 9 గంటల వరకే సిటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు నగరంలోని ప్రధాన మార్గాలలో ట్రాఫిక్ రద్దీ భారీగా ఉంటుంది. పొరుగు రాష్ర్టాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులతో రోడ్లన్నీ రాత్రి వేళల్లో రద్దీగా ఉంటున్నాయి. అయితే, 10 గంట ల తరువాత వీటికి అనుమతు ఉన్నా అంతకు ముందే సిటీలోకి ఎంట్రీ కావడంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
స్తంభిస్తున్న రోడ్లు..!
రాత్రి తొమ్మిదయ్యిందంటే చాలు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కూకట్పల్లి నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్ వరకు ప్రైవేట్ బస్సుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రధాన రహదారిపై బారులు తీరి ప్రయాణించే ప్రైవేట్ బస్సులతో ట్రాఫిక్ అంతా రద్దీగా మారుతుంది. ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ బస్సులను ఆపేస్తూ రాత్రి వేళల్లో రోడ్లను ప్రైవేట్ వ్యక్తులు స్తంభింపజేస్తుంటారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై ఉండకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు శృతి మించిపోతుంటాయి. రోడ్లపై మధ్యలోనే బస్సులను ఆపడంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే జామ్ అవుతుంది.
రాత్రి వేళ్లలో సమస్య వస్తే సామాన్య వాహనదారులు ఎవరికి చెప్పుకోలేక గంటల తరబడి రోడ్లపైనే ట్రాఫిక్‌లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతుంటారు. ఇక ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీ వరకు మార్గమధ్యంలో లక్డీకాపూల్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ లైట్ ఒక్కటే పనిచేస్తుంది. అయితే, ట్రాఫిక్ సిబ్బంది అటూ వైపు కూడా చూడరు. దీంతో అటు బీఎస్ఎన్ఎల్ భవన్ నుంచి ఇటు మెహిదీపట్నం వెళ్లేందుకు వచ్చేవారు, ఖైరతాబాద్, మెహిదీపట్నం వైపు నుంచి అసెంబ్లీ వైపు వెళ్లే వారితో ఈ కూడ లి బిజీగా ఉంటుంది. పగలు కాదు, రాత్రి వేళల్లోనూ నగరంలో ట్రాఫిక్ సమస్యలతో సగటు నగర పౌరుడు కొట్టుట్టాడుతున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు జోక్యం కలుగ చేసుకొని రాత్రి వేళల్లోనూ ట్రాఫిక్‌ను నిలువరించేందుకు కనీస చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.