Hyderabad | సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ట్రాఫిక్‌తో ఎక్కడి జంక్షన్లు అక్కడే జామ్ అవుతున్నాయి. ఒక కిలోమీటర్‌కు గంట.. రెండు కిలోమీటర్లకు రెండు గంటల సమయం పడుతోంది. ఈ ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు సైతం గంటల తరబడి ఆగిపోతున్నాయి. అందులో ఉండే పేషెంట్లు విలవిల లాడుతున్నారు. దీనికి తోడు వినాయక నవరాత్రులు ఉండడంతో ఖైరతాబాద్‌లోని బడా గణేశ్‌ను దర్శించుకునేందుకు వచ్చి పోతున్న భక్తులతోనూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నది.
ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఉంటుందని ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చామని.. ఏమి చేస్తామంటూ అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు చేతులెత్తేస్తున్నారు. ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడం, సిగ్నల్ నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే సమస్య సోమవారం తీవ్రంగా మారింది.
హైదరాబాద్‌లో సోమవారం ఎక్కడి ట్రాఫిక్ అక్కడే స్తంభించింది. ప్రధానంగా మొజంజాహి మార్కెట్, నాంపల్లి, మెహిదీపట్నం, బంజారాహిల్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని ట్రాఫిక్ జంక్షన్లన్నీ జామ్ అయ్యాయి. లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్‌కు చేరుకోవడానికి గంటకు పైగానే సమయం పట్టింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమస్య ప్రధానంగా ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనం కోసం వచ్చే భక్తుల వల్ల వచ్చిందంటూ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్లే భక్తులు మెట్రో స్టేషన్ పైనుంచి అవతలి వైపు వెళ్లాలని సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. చాలా మంది భక్తులు సూచనలకు అనుగుణంగానే వెళ్తున్నారు. మరికొందరు రోడ్డు దాటుతుండటంతో కొంత మేరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. నడుచుకుంటూ వెళ్లే ప్రజలకు మెట్లు పైనుంచి వెళ్లాలని సూచించే సిబ్బంది అక్కడ లేకపోవడంతో రోడ్డు దాటుతున్నారు. అయోధ్య జంక్షన్ నుంచి ఖైరతాబాద్‌కు వచ్చే దారిలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఒక అంబులెన్స్ గంటకుపైగా ఆ మార్గంలోనే ఉండిపోయింది.
అయితే, ఈ అంబులెన్స్ ఖైరతాబాద్ రాగానే పోలీసులు రాంగ్రూట్లో తీసికెళ్లి దారి చూపించారు. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను సరైన రీతిలో నిర్వహించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వాహనదారులు పేర్కొన్నారు. ఈ ప్రభావం నిరంకారి వైపు, నెక్లెస్ రోడ్డు, రాజ్‌భవన్ రోడ్డు, అమీర్‌పేట నుంచి వచ్చే వాహనాలపై తీవ్రంగా పడిందన్నారు. దీంతో మూడు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. కొత్తగా సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌కు ట్రాఫిక్‌పై పూర్తి అవగాహన ఉన్నదని.. కనీసం మీరైనా ఈ ట్రాఫిక్‌ను చక్కబెట్టండి సారూ.. అంటూ వాహనదారులు కోరుతున్నారు.
ట్రాఫిక్ పోలీసులు కేవలం చలాన్లు వేయడానికే మాత్రమే పరిమితం.. అన్నట్లుగా ట్రై పోలీస్ కమిషనరేట్లలో వ్యవహరిస్తున్నారు. రోడ్లపైకి ప్రతినెలా సుమారు 35 వేల కొత్త వాహనాలు వస్తున్నాయి. గడిచిన పదేండ్ల కాలంలో పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వ్యూహం మారుస్తూ సాఫీగా ట్రాఫిక్ సాగేందుకు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.
ట్రాఫిక్‌లో పనిచేసే వారికి 30 శాతం అదనపు జీతం ఇస్తున్నా.. అందుకు తగ్గట్టుగా ఎవరూ పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్‌లో పనిచేసే వారికి కష్టం ఎక్కువగా ఉంటుందని, వారు ఉత్సాహంగా పనిచేయాలంటే తప్పని సరిగా సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, నేడు ట్రాఫిక్‌లోకి వచ్చిన సిబ్బంది ఉదయం, సాయంత్రం చేరో రెండు గంటల పాటు అలా పనిచేస్తే సరిపోతుందనే ధోరణితో ఉంటూ ప్రజా సమస్యలను పక్కన పెట్టారు. ట్రాఫిక్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉన్న ఇన్స్పెక్టర్.. ఆ పై స్థాయి అధికారులు సైతం తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.