రవీంద్రభారతి, నవంబర్ 19 : భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూకు పిల్లలు అంటే ఇంతో ఇష్టమని, అందుకే నవంబర్ 14న ఆయన జయంతి సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహిస్తామని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో భారత్ బాలోత్సవం-11 పేరిట బాలల దినోత్సవాన్ని ఆదివారం రవీంద్రభారతిలోని మొయిన్హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోలేటి దామోదర్‌గుప్త, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి జవహర్లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, పిల్లల హక్కులు- చదువు, సంక్షేమం తదితతర అంశాలపై అవగాహన కల్పిం చారు. అనంతరం బాలికలను ప్రోత్సహిస్తూ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ లయన్ కె.వి రమణారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో లలితారావు, దీపిక, కాంతి కృష్ణ, రచయిత శశిబాల, అబ్దుల్ రెహమాన్, కుమార్ సంతు, జ్యోతి కులకర్ణి, విజయలక్ష్మి కృష్ణప్రియ, సురేఖ, కృష్ణ భార్గవి, వసుధ, విష్ణుతేజ పాల్గొన్నారు.