సిటీబ్యూరో, జూన్ 20, (నమస్తే తెలంగాణ): మానవుని మనుగడలో యోగా తప్పనిసరైంది. అనారోగ్య, మానసిక సమస్యలతో సతమతమయ్యేవారికి ఆయువుపోస్తున్నది. మరీ ముఖ్యంగా నెలసరి, పీసీవోడీ సమస్యలతో నిత్యం బాధపడే మహిళలకు యోగా సాధనం ఔషధంలా పనిచేస్తున్నది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆసుపత్రుల చుట్టే తిరగాల్సిన పనిలేకుండా ప్రతిరోజూ ఒక గంటపాటు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నది అక్షర సత్యం. అందుకే మన ఆరోగ్య రక్షణకు దిక్షూచి అయిన యోగా ప్రాముఖ్యతను తెలిపేలా.. ప్రతి ఏడాది జూన్ 21న ‘ప్రపంచ యోగా దినోత్సవం’ నిర్వహిస్తుండటం గమనార్హం. నేడు యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన పలువురు యోగా ట్రైనర్లతో ‘నమస్తే’ ముచ్చటించింది.
హైదరాబాద్ నగరం అభివృద్ధితో పాటు అనారోగ్య సమస్యలతో ముందుకు దూసుకుపోతుంది. ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులు, చరవాణి మోజులో నిద్రకు దూరమవుతున్న రేపటి తరం, నాసికరమైన తిండి, నియంత్రణ లేని జీవనం వంటి సమస్యలతో మానసికంగా, ఆరోగ్యంగా కుంగిపోతున్నారు. వాటి నుంచి తమను తాము రక్షించుకునేందుకు వ్యాయమం, యోగా వైపు తమ దృష్టిని మళ్లిస్తున్నారు.
ఇప్పటికే నగరంలోని ప్రధాన పార్కుల్లో స్వచ్ఛంద సంస్థల వాళ్లు సైతం ఉచితంగా యోగా నేర్పిస్తుండటం గమనార్హం. వైద్యులు సైతం రోగి మానసిక స్థితి మెరుగుదల కోసం యోగా చేయాలని సూచిస్తుండటం గమనార్హం. కానీ నగరంలో క్రమం తప్పకుండా యోగా చేసే వాళ్లలో 70 శాతం వరకు, 40 ఏండ్లకుపైబడిన వాళ్లే ఉండటం గమనార్హ ం. యోగా చేయడంలో యువత ప్రాధాన్యత చాలా తక్కువనే చెప్పాలి. దీని కారణంగా చిన్న చిన్న ఘటనలకు కూడా బెంబేలెత్తిపోయి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. అలాంటివారి దృష్టి యోగా వైపు మళ్లిస్తే వారి జీవితాలకు వెలుగునిచ్చినవారమవుతాం. ఆసనాలు చేయొద్దని హెచ్చరించారు
నాకు పాఠశాల దశ నుంచే యోగా మీద అభిరుచి ఉండేది.
వృత్తి రీత్యా నూట్రీషన్నే అయినా కూడా నా వద్దకు అనారోగ్య సమస్యలతో వచ్చేవారికి యోగా చేయాలంటూ సలహాలు ఇచ్చేదాన్ని. కానీ నేను ట్రైనర్‌గా మారింది మాత్రం నా ప్రసవం తరువాతే. నేను గర్భవతిగా ఉన్న సందర్భంలో మనసు ప్రశాంతత కోసం యోగా చేసేదాన్ని. చాలా మంది ఆసనాలు వేయొద్దని సూచించారు. అయినా కూడా నేడు మానుకోలేదు. అనుమానాలకు తావులేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా ప్రసవం జరిగింది. అప్పటి నుంచి నా మీద నాకు మరింత విశ్వాసం పెరిగింది. అందుకే యోగా ట్రైనర్‌గా ప్రయాణం మొదలు పెట్టాను. ప్రస్తుతం ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో యోగా నేర్పిస్తున్నాను. ఒక న్యూట్రీషనిస్టుగా శరీరానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచించడం నేర్పిస్తున్నా.
– స్వప్న ,యోగా ట్రైనర్
ఫ్యాషన్‌తో యోగా నేర్చుకున్నా. డిగ్రీ చదవుతున్న సందర్భంలో కాస్త దూరంగా ఉన్నా, నాకు ఎలర్జీ కారణంగా తిరిగి యోగా చేయడం ప్రారంభించా. ఎలర్జీ కారణంగా విపరీతంగా తుమ్ములతో బాధపడ్డా. మెడిసిన్ వాడినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రతిరోజూ శ్వాస సంబంధిత యోగా చేశా. మూడు నెలల్లో ఎలర్జీ నుంచి బయటపడ్డా. మరోవైపు ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసిన సందర్భంలో ఇంట్లో వాళ్లతో ఒక్క క్షణం కూడా గడిపే అవకాశం లేకుండే. ఒత్తిడితో సతమతమయ్యేదాన్ని. నాకు ఎంతో ఇష్టమైన యోగానే ఉపాధిగా చేసుకున్నా. మా అపార్ట్మెంట్లో ఉండే మహిళలకు ప్రతిరోజూ గంటసేపు యోగాను నేర్పిస్తున్నా. చాలా మంది పీసీవోడీ, నెలసరి సమస్యలతో వస్తుంటారు. వారికి యోగా చేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు.
– పావని యోగా ట్రైనర్
నేను స్కూళ్లో ఉన్నప్పుడు మా పీఈటీ సార్ ప్రోత్సాహంలో యోగా నేర్చుకున్నా. పెద్దాయ్యాక చాలా మందిలాగే ఐటీ ఉద్యోగం చేయాలనుకున్నా. నిత్యం మానసిక ఒత్తిడికి గురవుతున్న ఐటీ ఉద్యోగుల మానసిక పరిస్థితి తెలుసుకొని నా నిర్ణయం మార్చుకున్నా. అందుకే ఎంఎస్సీ యోగా చేశా. ఇప్పటివరకు ఐదుసార్లు ఇంటర్ యూనివర్సిటీ యోగా పోటీల్లో పాల్గొన్నా. తెలంగాణ నుంచి 10 సార్లు నేషనల్ యోగా చాంపియన్‌షిప్‌లో పాల్గొని ప్రతిభ చూపారు. మూడేండ్లుగా అమెరికాకు చెందిన 20 మందికి ఆన్లైన్లో యోగా శిక్షణ ఇస్తున్నాను. దీంతో పాటు తెలుగు రాష్ర్టాల్లోని పలువురు సెలబ్రేటీలకు కూడా యోగా నేర్పిస్తున్నా. ప్రస్తుత నా నెల వేతనం రూ. లక్షన్నర. అందరి ఆరోగ్యం కాపాడటంతో పాటు ఆదాయాన్ని కూడా పొందుతున్నా. ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నా.
– మణికంఠ, యోగా ట్రైనర్
నేను రెండేండ్ల నుంచి థైరాయిడ్ సమస్యతో చాలా బాధపడ్డా. నేను వృత్తిరీత్యా డెంటిస్టును. ఇంగ్లిష్ మెడిసిన్ వాడినా కూడా కంట్రోల్ కానీ థైరాయిడ్ సమస్యకు యోగాతో చెక్ పెట్టా. ఆన్లైన్లో శిక్షణ తీసుకొని ఆరోగ్యవంతంగా ఉన్నాను. నా ఎనిమిదేండ్ల కూతురుకు భవిష్యత్‌లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడుతూ యోగా శిక్షణనిప్పిస్తున్నా.
– శ్రావ్య