సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా రెండు రోజులుగా రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం యూసుఫ్‌గూడ డివిజన్లో రాత్రి ఏడు గంటలకు రోడ్ షో చేపడుతారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు పలు కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు.
ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు షేక్‌పేట పరిధిలోని సత్వ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు షేక్‌పేటలోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతారు. మధ్యాహ్నం 3. 30 గంటలకు తెలంగాణ భవన్లో చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరనున్నారు. నవతారెడ్డి ఆధ్వర్యంలో 1000 మందికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. రోజంతా కేటీఆర్ సుడిగాలి పర్యటన చేయనున్నారు.