చాంద్రాయణగుట్ట, 29 (నమస్తే తెలంగాణ): చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సోమవారం పాతబస్తీ నవాబుసాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు బైక్‌పై చార్మినార్ నుంచి షంషీర్గంజ్ వైపు ప్రధాన రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో తీవ్ర గాయమైంది.
స్థానికులు వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ దవాఖానకు తరలించగా వైద్యులు గొంతు చుట్టూ 12 కుట్లు వేశారు. దీంతో ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో చైనా మాంజా విక్రయించే వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 24 చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. మాంజా విక్రయిస్తున్న సుమీత్, ఉదయ్ కిరణ్‌లపై కేసులు నమోదు చేశారు.