హయత్‌నగర్/పెద్ద అంబర్‌పేట మే 21 : కుంట్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కుంట్లూరుకు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రీనాథ్రెడ్డి (24), చుంచు వర్షిత్‌రెడ్డి (23), ఎలిమేటి పవన్‌కళ్యాణ్‌రెడ్డి (24) కలిసి కారులో పసుమాముల నుంచి కుంట్లూరుకు బయలుదేరారు.
అదే సమయంలో కుంట్లూరు నుంచి పసుమాముల వైపు డీసీఎం బయలుదేరింది. మార్గమధ్యలో కుంట్లూరులోని నారాయణ కళాశాల-బాసర క్యాంపస్ ఎదురుగా మూలమలుపు వద్ద అతివేగం, అజాగ్రత్తగా ఎదురెదురుగా వచ్చిన డీసీఎం, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పిన్నింటి చంద్రసేనారెడ్డి, చుంచు త్రీనాథ్రెడ్డి, చుంచు వర్షిత్‌రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఎలిమిటి పవన్ కళ్యాణ్‌రెడ్డిని చికిత్స కోసం పోలీసులు వైద్యశాలకు తరలించారు.
కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు, స్థానికుల సహాయంతో ఇనుప రాడ్లతో వెలికి తీసి.. పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతులంతా కుంట్లూరు గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మూలమలుపు వద్ద అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఘటనాస్థలాన్ని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ నవీన్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులు వారికి వివరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను అక్కడ నుంచి తరలించారు.