ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని మనస్థాపం చెందిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మన్సూరాబాద్, ఏప్రిల్ 22: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదన్న మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్ నగర్, తట్టి అన్నారం, వైయస్సార్ కాలనీకి చెందిన సుక్క రవికుమార్ కూతురు సుక్క అరుంధతి(17) ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్నది.
మంగళవారం విడుదలైన పరీక్ష ఫలితాల్లో బాటనీ సబ్జెక్టులో అరుంధతి ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన విద్యార్థిని మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకున్నది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నాగోల్ లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అరుంధతిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలి సోదరుడు గౌతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బంజారాహిల్స్లో మరొకరు…
బంజారాహిల్స్: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాయని తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే… బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న సుమతి, రామకృష్ణ ల కూతురు బాలిక నిష్ఠ(16) స్థానిక అభ్యాస జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది.
మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో ఆన్లైన్ లో చూసుకున్న నిష్ఠ కెమిస్ట్రీలో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రామకృష్ణ దంపతులు కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బల్కంపేటలో ఇంకొకరు..
అమీర్పేట్, ఏప్రిల్ 22 : ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్టు ఫెయిల్ అయ్యాననే బాధతో ఓ విద్యార్ధి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవంతినగర్ తోటలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అవంతినగర్ తోటలో నివాసముంటున్న ప్రైవేట్ ఉద్యోగి సత్యనారాయణ కుమారుడు ప్రశాంత్(17) బల్కంపేటలోని 9 ఎడ్యుకేషన్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.
బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్టులో ఫెయిలైనట్టు తెలుసుకుపని తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.