బంజారాహిల్స్, ఏప్రిల్ 21: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ కేసులో పురోగతి లభించింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 92లో నివాసం ఉంటున్న మాజీ మంత్రి. బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనవరి 10న సమీపంలోని టీటీడీ ఆలయంలో దైవదర్శనం కోసం వెళ్లి వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆల్మారాలో ఉన్న రూ.1.5లక్షల నగదు, బంగారు గాజులు, నెక్లెస్‌లు, ఇతర ఆభరణాలు చోరీ చేసి ఉడాయించారు. ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వేలిముద్రలతో నిందితుల గుర్తింపు..
పొన్నాల లక్ష్మయ్య నివాసంలో చోరీ తర్వాత సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఘటనాస్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడం, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ చీకటి వల్ల సరిగ్గా కనిపించకపోవడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెం 87లో నివాసం ఉంటున్న వ్యాపారి సురేందర్‌రెడ్డి ఇంట్లో చోరీ కోసం వచ్చిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన డ్రైవర్ రాజ్కుమార్పాండే అనే వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పదేళ్లుగా నగరంలోనే ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ పాండేను అదుపులోకి తీసుకుని విచారించిన ఫిలింనగర్ పోలీసులు అతడి వేలిముద్రలు సేకరించారు. వాటిని ఫింగర్‌ప్రింట్ బ్యూరోలో నమోదు చేశారు. కాగా పొన్నాల లక్ష్యయ్య ఇంట్లో చోరీ సందర్భంగా లభ్యమైన వేలిముద్రలతో పాండే వేలిముద్రలు సరిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పొన్నాల లక్ష్యయ్య ఇంట్లో చోరీ ఘటనలో కీలకంగా వ్యవహరించిన రాజ్‌కుమార్ పాండేతో పాటు అతడి స్నేహితులు పాల్గొన్నట్లు తెలిసింది. దీంతో నిందితులను ముగ్గురినీ సోమవారం అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా చోరీ సొత్తుతో ఉడాయించిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. కేసులో చోరీ సొత్తును రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.