సిటీబ్యూరో/మన్సూరాబాద్: బహుళ అంతస్తుల నిర్మాణం కోసం తవ్విన డబుల్ సెల్లార్ మట్టిదిబ్బలు కూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధి చంద్రపురికాలనీలోని గ్రాండ్ సితార హోటల్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు పక్కన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన కుసుమ రమేశ్, కుసుమ విజయతో పాటు బిల్డర్ సిద్దం సాయినాథ్ అనే వ్యక్తులు చంద్రపురికాలనీలోని సర్వే నం. 59, ప్లాట్ నం. 36, 37 పార్ట్ అండ్ 37లోని 1335.26 స్కైర్ మీటర్లలో ఓ బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి అనుమతులు పొందారు. డబుల్ సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో నాలుగు అంతస్తులు వేసుకునేందుకు 23 డిసెంబర్ 2024లో అనుమతులు లభించాయి. సదరు భూమిలో డబుల్ సెల్లార్ తవ్వారు.
పిల్లర్ల నిర్మాణాల కోసం బేస్ వేసే పనిని ఇటీవల చేపట్టారు. పిల్లర్లలో కాంక్రీట్‌ను నింపే పని కోసం కొందరు కూలీలు బుధవారం ఉదయం చంద్రపురికాలనీలో నూతనంగా నిర్మిస్తున్న భవనం సెల్లార్ వద్దకు చేరుకున్నారు. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం, మల్లుపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట్ల వీరయ్య (50), ఆలకుంట్ల రాము (20), ముద్దంగుల శ్రీనివాస్ (19) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఆరేండ్లుగా పెద్ద అంబర్‌పేటలో నివాసముంటూ కూలీ పని చేస్తున్నారు. ఆలకుంట్ల వీరయ్య, రాము తండ్రి కొడుకులు కాగా.. శ్రీనివాస్, వీరయ్య చెల్లెలి కొడుకు. రెండు సంవత్సరాల కిందట సోదరి మృతి చెందడంతో శ్రీనివాస్‌తో పాటు అతడి సోదరుడైన శ్రీరామ్‌ను వీరయ్య తన వద్దే ఉంచుకున్నారు. శ్రీనివాస్‌ను తనతో పనికి తీసుకెళ్తుండగా.. శ్రీరామ్ చదువుకుంటున్నాడు.
వీరయ్య, రాము, శ్రీనివాస్‌తో పాటు నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, గ్రామానికి చెందిన భిక్షపతి (33) మరో ఇద్దరు వ్యక్తులు బుధవారం ఉదయం 9 గంటలకు పని కోసం చంద్రపురికాలనీలో సెల్లార్ వద్దకు చేరుకొని పిల్లర్లలో కాంక్రీట్‌ను నింపే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు 10 గంటల సమయంలో ఒక్క ఉదుటున సెల్లార్ పై భాగంలోని మట్టి దిబ్బలు కూలి వీరయ్య, రాము, శ్రీనివాస్, భిక్షపతిపై పడ్డాయి. మట్టి దిబ్బల కింద నలుగురు కూరుకుపోయారు. సెల్లార్లో కొద్ది దూరంలో వేరే పనిలో నిమగ్నమై ఉన్న ఇద్దరు కూలీలు బయటకు పరుగెత్తుకొచ్చారు. విషయాన్ని గ్రహించిన సూపర్వైజర్ ఎల్బీనగర్ ట సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడి చేరుకొని మట్టి దిబ్బలను తొలగించారు. సుమారు 10 ఫీట్ల మట్టి కింద కూరుకుపోయిన వీరయ్య, రాము, శ్రీనివాస్, భిక్షపతిని బయటకు తీయగా.. ఊపిరి ఆడక వీరయ్య, రాము, శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భిక్షపతిని ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
పరిహారం అందజేయాలి ; ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
సెల్లార్ మట్టి దిబ్బలు పడి ముగ్గురు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్నారు. సంఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం ఎల్బీనగర్ కామినేని దవాఖానలో చికిత్స పొందుతున్న భిక్షపతిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తికి ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు, గాయపడిన వ్యక్తికి రూ. 10 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
ముగ్గురు చనిపోవడం దురదృష్టకరం ; జోనల్ కమిషనర్, హేమంత కేశవ్ పాటిల్
సెల్లార్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం ఒక వ్యక్తి గాయపడటం ఎంతో దురదృష్టకరమని జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. వీరయ్య, రాము, శ్రీనివాస్ మృతి చెందిన విషయాన్ని జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, నగర మేయర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
చంద్రపురికాలనీలోని సర్వే నం. 59, ప్లాట్ నం. 36, 37 పార్ట్ అండ్ 37లోని 1335.26 స్కైర్ మీటర్లలో నిర్మిస్తున్న భవనానికి 23 డిసెంబర్ 2024లో కుసుమ రమేశ్, కుసుమ విజయతో పాటు బిల్డర్ సిద్దం సాయినాథ్ అనే వ్యక్తులు అనుమతులు తీసుకుని భద్రతా చర్యలు చేపట్టకుండా నిర్మాణాలు జరిపారని జీహెచ్ఎంసీ అధికారులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ముగ్గురు మృతికి కారణమైన ప్లాటు యజమానులతో పాటు బిల్డర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై బిల్డింగ్ యజమానులకు, బిల్డర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చే వరకు బిల్డింగ్ అనుమతులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
సెల్లార్ తవ్వకాల్లో నిబంధనలు తూచ్..
ఇటీవల కాలంలో పుప్పాలగూడ గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాద ఘటన, సిద్ధిఖీనగర్‌లో నెలకు ఒరిగిన నాలుగు అంతస్తుల నిర్మాణం ఘటన మరుకముందే ఎల్బీనగర్లోని మన్సురాబాద్‌లో కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణ పనుల సెల్లార్ తవ్వకాల సందర్భంగా నిర్మాణదారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టని ఫలితంగా ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. మరొకరు గాయాల పాలై దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో సదరు నిర్మాణదారులు అడ్డగోలుగా సెల్లార్ తవ్వకాలు జరుపుతున్నట్లు తేలింది. వాస్తవంగా సెల్లార్ తవ్వకాలు, నిర్మాణ సమయంలో కచ్చితంగా సెట్బ్యాక్లు వదిలి పెట్టాలి.
ముఖ్యంగా రక్షణ గోడలు కడుతూ సెల్లార్ పనులు చేపట్టాలి. కచ్చితంగా సైట్ ఇంజినీర్ పర్యవేక్షణ, ప్లానింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణ ఉండాలి. కానీ నిబంధనలకు నిర్మాణదారులు నీళ్లొదిలారు. తలా పాపం తిలా పిడికెడు అన్నట్లు నిర్మాణదారులు, అధికారుల పర్యవేక్షణ లేమితో ముగ్గురు అమాయక కార్మికులను పొట్టన పెట్టుకున్నారు. కాగా, ఎల్బీనగర్ ఘటనలో అధికారులు సెల్లార్ తవ్వకాల్లో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ సదరు నిర్మాణ అనుమతి రద్దుతో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. కాగా, నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణదారులపై ఉక్కుపాదం మోపేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. కానీ గడిచిన కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో ఈ టాస్క్‌ఫోర్స్‌లో చలనం లేదు.