ఖైరతాబాద్, మే 18 : అర్ధరాత్రి ఓ హాస్టల్లో అలజడి సృష్టించారు. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అమీర్‌పేట ఎంసీహెచ్ మార్కెట్ రోడ్లో ఈ ఘటన జరిగింది. బాధిత యువతులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీ రాష్ర్టానికి చెందిన భార్యాభర్తలు హనుమాన్‌రెడ్డి, శివపార్వతి, కొడుకు వీరారెడ్డితో కలిసి అమీర్‌పేట ఎంసీహెచ్ మార్కెట్ రోడ్లో ఓ ఐదంస్థుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు.
అందులో ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ పేరుతో హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 35 మందికిపైగా విద్యార్థినులు, యువతులు అందులో ఉంటున్నారు. ఈ నెల 16న గుర్తుతెలియని ముగ్గురు దుండగులు తెల్లవారుజామున హాస్టల్ రెండో అంతస్థులో యువతులు ఉన్న గదిలోకి ప్రవేశించారు. ఒక్కసారిగా మేల్కొన్న యువతులు భయబ్రాంతులకు గురై తోటి రూమ్మెట్స్ను పిలిచారు. అయినా వారు వెళ్లిపోకుండా అక్కడే తచ్చాడుతున్నారు. దీంతో గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు.
హాస్టల్ యజమాని, అతని కొడుకు సహకారంతోనే దుండగులు లోనికి ప్రవేశించారని బాధిత యువతులు చెబుతున్నారు. దుండగులు పారిపోయిన తర్వాత యజమానిని నిలదీస్తే మీ బాయ్ ఫ్రెండ్స్‌ను తెచ్చుకొని బుకాయిస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని యువతులు వాపోయారు. హాస్టల్ యజమానికి ముందుగానే సమాచారం ఉందని బాధిత యువతులు చెబుతున్నారు. గతంలోనూ యజమాని, అతని కొడుకుకు సంబంధించిన వ్యక్తులు అకారణంగా హాస్టల్లోకి ప్రవేశించి వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు. కాగా, ఈ ఘటన తర్వాత భార్యాభర్తలిద్దరూ కనిపించకుండా పోయారు. బాధిత యువతుల ఫిర్యాదు మేరకు యజమాని కొడుకు వీరాను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
దుండగులు ప్రవేశించే సమయంలో అక్కడి సీసీ కెమెరాలు పనిచేయలేదు. కొన్ని సీసీ కెమెరాలపై బట్టలు వేసి ఉన్నాయి. దుండగులు లోనికి వచ్చి యువతుల గదుల్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. ఆ పుటేజీలు రాకుండా ముందస్తుగా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు. దుండగులు పారిపోయిన తర్వాత ఆ కెమెరాలపై ఉన్న బట్టలను తొలగించారు. అంతకు ముందే వాటి ప్రధానమైన కనెక్షన్లను కట్ చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా, దుండగులు ప్రవేశానికి ముందే అవి పనిచేయకుండా పోయినట్లు గుర్తించారు.