హైదరాబాద్: విహార యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. హైదరాబాద్ (Hyderabad) పాతబస్తిలోని ఛత్రినాక నుంచి యాత్రికులతో బయల్దేరి ఒడిశా వెళ్లిన ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. మృతులను క్రాంతి, ఉదయ్ సింగ్, ఉప్పలయ్యగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.