బంజారాహిల్స్: భారీ వర్షంతో మూడురోజుల కిందట బంజారాహిల్స్ రోడ్ నం. 5లోని దేవరకొండబస్తీలో పలు ఇండ్లు నీటమునిగాయి. నాలాలో వచ్చిన వరదనీరు ముందుకు వెళ్లేందుకు దారిలేకపోవడంతో రోడ్లపై వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే సమస్యలకు కారణాలను ఆన్వేషించి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం నిద్రమత్తును వీడడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేవరకొండబస్తీలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి సుమారు 300 మీటర్ల మేర నాలా మొత్తం పూడికతో నిండిపోయింది. వేసవి కాలంలో పూడికతీత చేయకపోవడంతో 50 శాతం మాత్రమే వరదనీరు ప్రవహించే అవకాశమున్నది. దీనికితోడు నాలాలో చెత్తాచెదారం, వ్యర్థాలు, ధర్మకోల్ షీట్లు మొత్తం నాలాలో ఇరుక్కుపోవడంతో వరదనీరు మొత్తం రోడ్ల మీదకు వచ్చిందని, మూడురోజులు గడిచినా అధికారులు వచ్చి నాలాలో అడ్డంకులు తొలగించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి భారీ వర్షాలు వచ్చే ప్రమాదం ఉండడంతో మరోసారి బస్తీ మొత్తం వరదనీటితో నిండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దేవరకొండ బస్తీలోని నాలాలో పూడికతీత చేపట్టడంతో పాటు నాలా స్థానంలో బాక్స్ డ్రెయిన్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.