Hyderabad | మెహిదీపట్నం, ఫిబ్రవరి 15 : జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్తులను లంగర్ హౌస్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముగ్గురి నుంచి 13 తులాల బంగారు ఆభరణాలతో పాటు 29 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు శనివారం మధ్యాహ్నం దక్షిణ పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చంద్రమోహన్, అదనపు డిసిపి ఇక్బాల్ సిద్ది ఖీ, గోల్కొండ ఏసీబీ సయ్యద్ ఫయాజ్, అదనపు ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ రాఘవేంద్రలతో కలిసి వివరాలను వెల్లడించారు.
జనవరి 15వ తేదీన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేఖర్ గౌడ్ ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన లంగర్ హౌస్ పోలీసులు శనివారం దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందినఆరే సాయి(19) కూకట్పల్లిలో ఉంటూ టైల్స్ వర్క్ చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడితోపాటు తిరుమలగిరిలో నివసించే డేవిడ్ రాజ్(18), మాగంటి సాయికుమార్(22) పాత నేరస్తులు. వీరు ముగ్గురు ఆరు దొంగతనాలకు పాల్పడ్డారు. కేసు దర్యాప్తులో ఉంది.