Crime News | సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా నకిలీ నిత్యావసర, కొబ్బరి నూనె, మసాలాలు వంటి కిరాణా సరుకులను కాటేదాన్, నాగారం కేంద్రంగా తయారు చేసి, పేరున్న బ్రాండ్ల పేర్లతో విక్రయాలకు పాల్పడుతున్న రాజస్థానీ ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను నగర సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 2కోట్ల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన మహేంద్రాసింగ్, శ్యామ్ భాటి, కమల్ భాటిలు ఉపాధి కోసం కొంత కాలం కిందట నగరానికి వలస వచ్చారు.
మహేంద్రసింగ్ కీసర మండలంలోని నాగారంలో, శ్యామ్, కమల్ భాటీలు బేగంబజార్ నివాసముంటూ నకిలీ నూనెలు, ఆహార పదార్థాలు, కిరాణా వస్తువులను తయారు చేస్తున్నారు. పారాచూట్ కొబ్బరి నూనె, రెడ్‌లేబుల్ టీ పౌడర్, ఎవరెస్ట్ మసాలాలు, సర్ఫ్ ఎక్స్ఎల్ డిటర్జెంట్ పౌడర్, లైజాల్, హార్పిక్ తదితర బ్రాండెడ్ పేర్లతో అన్ని రకాల నిత్యావసర కిరాణా వస్తువులను తయారు చేసి, నగరంలోని సూపర్మార్కెట్లు, కిరాణా జనరల్ స్టోర్లకు సరఫరా చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన లేబుల్స్‌ను ఢిల్లీ, గుజరాత్, బెంగళూరు నుంచి కొనుగోలు చేసి, వాటిలో నకిలీ వస్తువులు, ఆహార పదార్థాలు, వంట నూనెలను ప్యాక్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, కాచిగూడ పోలీసులతో కలిసి ఒకేసారి సైబరాబాద్ పరిధిలోని కాటేదాన్, బేగంబజార్, రాచకొండ పరిధిలోని నాగారంలోని గోదామ్లు, తయారీ కేంద్రాలపై దాడులు జరిపి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 కోట్ల విలువైన 30 రకాల బ్రాండ్లకు చెందిన నకిలీ ఆహార పదార్థాలు, నూనెలు, కిరాణా వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డీసీపీ రశ్మీ పెరుమాల్ పర్యవేక్షణలో జరిపిన ఈ దాడుల్లో సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాజు నాయక్, కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎన్. రామ లక్ష్మణ్‌రాజు, ఎస్ఐలు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.