Crime News | సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కళాశాలలో నేరుగా వచ్చిన సాధారణ అడ్మిషన్లను ఏజెంట్ల ద్వారా వచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి యాజమాన్యాన్ని తప్పుదారి పట్టించి సుమారు రూ.2కోట్ల వరకు మోసగించిన ముగ్గురిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన సానికొమ్ము సుమ మొయినాబాద్ మండలం, హిమాయత్‌నగర్‌లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ డీన్‌గానూ, అడ్మిషన్ విభాగం ఇన్చార్జిగా పనిచేస్తున్నారు.
అదే జిల్లాకు చెందిన భూతపతి డింకర్, బుర్ర శ్రీకాంత్ కూడా అక్కడే అడ్మిషన్ విభాగంలో పనిచేస్తున్నారు. ఈ యూనివర్సిటీలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన విద్యార్థులు కన్సల్టెంట్ ఏజెన్సీ లేదా ఏజెంట్ల ద్వారానే కాకుండా నేరుగా కూడా వచ్చి అడ్మిషన్లు పొందుతారు. విద్యార్థులు కన్సల్టెంట్ ఏజెన్సీ లేదా ఏజెంట్ల ద్వారా అడ్మిషన్ పొందితే.. యాజమాన్యం సదరు ఏజెన్సీ లేదా ఏజెంట్లకు రెమ్యునరేషన్ చెల్లిస్తుంది.
దీనిని ఆసరాగా చేసుకుని డీన్, అడ్మిషన్ల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న సుమ తన కింది స్థాయి సిబ్బంది డింకర్, శ్రీకాంత్‌తో కలిసి కళాశాలలో నేరుగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ఏజెంట్ల ద్వారా వచ్చినట్టు నకిలీ పత్రాలు సృష్టించి రెమ్యునరేషన్ రూపంలో దాదాపు రూ.2 కోట్లు యూనివర్సిటీ నిధుల నుంచి తమ ఖాతాల్లోకి మళ్లించారు. విషయం తెలుసుకున్న యూనివర్సిటీ వ్యవస్థాపకులు డా.చింతలపాణి వెంకట పురుషోత్తం రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆర్థిక నేర విభాగం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.