సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తాము ట్రాయ్, పోలీసు అధికారులమని చెప్పి ఆధార్ నంబర్‌తో పలు విదేశాల్లో మానవ అక్రమ రవాణా జరిగిందని, ఇది సైబర్ క్రైమ్‌లో ఉపయోగించారంటూ చెప్పి హబ్సిగూడకు చెందిన 83 ఏళ్ల వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్లు రూ.80లక్షలు కొట్టేశారు. జూలై 12న బాధితుడికి తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అందులో తాము ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నామని.. ఆధార్‌కార్డ్‌ను ఉపయోగించి కంబోడియా, మయన్మార్, ఫిలిప్పైన్స్‌లో మానవ అక్రమరవాణాకు పాల్పడ్డారంటూ దీనిని సైబర్ నేరాలకు వాడారంటూ చెప్పడంతో వృద్ధుడు షాక్ అయ్యాడు.
అంతేకాక ఢిల్లీలో కేసయిందని చెప్పి అది నమ్మించడానికి బాధితుడి పేరు మీద తయారు చేసిన కెనరాబ్యాంక్ ఏటీఎం కార్డు, సుప్రీంకోర్టు నోటీసు పంపించారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే అందులో తన ప్రమేయం లేదని నిరూపించాలంటే తాము చెప్పిన విధంగా బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు భయపడి పలు అకౌంట్లకు రూ.80.64 లక్షలు పంపించాడు. ఇదే సమయంలో తనను పోలీసులు, లీగల్ అథారిటీస్ పేరుతోకూడా బెదిరించడంతో అతను మరింత భయపడిపోయాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించి శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చాంద్రాయణగుట్టకు చెందిన 21ఏళ్ల యువకుడికి ఈ నెల 9వ తేదిన దివ్యమెహతా నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. తాను చెగ్ ఇండియా కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్‌నంటూ పరిచయం చేసుకుని గూగుల్ ఆన్లైన్ ఆడిటర్‌గా బాధితుడికి ఉద్యోగం ఇస్తామని చెప్పింది. ఈ జాబ్‌తో ప్రతీరోజూ సుమారుగా రూ.3వేల నుంచి రూ.5వేల వరకు డబ్బులు సంపాదించవచ్చని నమ్మించింది.
ఆ తర్వాత డెమోటాస్క్ పేరుతో ఒక రెస్టారెంట్‌కు ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇవ్వాలని చెప్పి బాధితుడు రూ.1000ట్రాన్స్ఫర్ చేస్తే రూ.1410 వచ్చినట్లుగా చూపించారు. ఇది నమ్మి చాలావరకు డబ్బులు పెట్టిన బాధితుడికి సీనియర్ పేరుతో ఒకరు కాల్ చేసి అకౌంట్ ఫ్రీజ్ అయ్యాయని చెప్పి అందులో రూ.11లక్షల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించారు. అప్పటికే బాధితుడు రూ.8,18,500 పలు దఫాలుగా పంపించారు. అకౌంట్ ఓపెన్ అయి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే మరింత డబ్బు పంపాలని నేరగాళ్లు డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకులను రూ.32 లక్షలు మోసం చేసిన ఇద్దరు సైబర్నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సోషల్‌మీడియా ప్లాట్ఫామ్లో ఆదిత్యబిర్లా గ్రూపుకు సంబంధించిన ప్రకటన చూశారు. ఆ తర్వాత అతనిని ఆదిత్యబిర్లా స్టాక్ ఎలైట్ గ్రూప్ 678 అనే వాట్సప్ గ్రూపులో యాడ్ చేశారు. అయానాజోసెఫ్ అనే మహిళ తాను ట్రేడ్ అడ్వైజర్‌నంటూ పరిచయం చేసుకుని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుబడులు పెట్టాలని సూచించింది. బాధితుడు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత కేవైసీ డిటైల్స్ అడగడంతో అతను ఫామ్ ఫిలప్ చేశారు. ఆ తర్వాత అతనికి ఓటీసీ స్టాక్స్ వచ్చిన తర్వాత యాక్టివేట్ అవుతుందనిఆ తర్వాతనుంచి అతను స్టాక్స్ క్రయవిక్రయాలు చేయవచ్చని, అప్పుడు ఐపీఓకు ఐప్లె చేయవచ్చని చెప్పారు.
ఒక వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత అతనిని ఒక ఐపీఓ కొనుగోలు చేయమని చెప్పారు. అటునుంచి ఆయన కొన్ని లావాదేవీలు చేసిన తర్వాత మరో కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో అతను చెల్లించడానికి నిరాకరించడంతో డబ్బులు విత్ డ్రా కావడం లేదని తేలింది. అప్పటికే అతను రూ.32 లక్షలు నష్టపోయినట్లుగా గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరస్టైన వారిలో గుజరాత్‌కు చెందిన ఇనాందార్ వినాయక రాజేందర్, క్రికెట్ కోచ్ రిషి తుషార్ అరోతెలు ఉన్నారు. వీరిపై దేశవ్యాప్తంగా 12 కేసులున్నాయని పోలీసులు తెలిపారు.
ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్‌కుచెందిన 69 ఏళ్ల పూజారిని మోసం చేసిన పంజాబ్‌కు చెందిన సంజీవ్‌కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్‌లో బాధితుడికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి అతనిని ఒక వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేశామని, ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ కు సంబంధించిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోమని రాఘవశర్మ అనే వ్యక్తి సూచించారు. మొదట్లో లాభాలు చూపించడంతో బాధితుడు నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడులుగా పెట్టారు. కానీ అతనికి లాభాలు కానీ, పెట్టుబడులు కానీ తీసుకునేందుకు వీలు కాకపోవడంతో తాను రూ.1,23,40,000లు మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో అకౌంట్ హోల్డర్, ఆపరేట్ చేసిన సంజీవ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.