సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గించి, పరిహారం పెంచాలని ఇప్పటికే జేబీఎస్ శామీర్పేట్ మార్గంలో నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రాజెక్టు వలన నివాస గృహాలు, మతపరమైన నిర్మాణాలకు నష్టం జరిగేలా ఉందని, ప్రాజెక్టు అలైన్మెంట్ మార్చాలంటూ ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో ఉండే నివాసితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టు అలైన్మెంట్ను పునఃసమీక్షించి రీ సర్వే చేయాలని, అవసరమైతే అలైన్మెంట్ మార్చి ప్రాజెక్టు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ప్యారడైజ్ నుంచి మేడ్చల్ మార్గంలో, జేబీఎస్ నుంచి శామీర్పేట్ మార్గంలో మెరుగైన రవాణాకు ఆస్కారం ఉండేలా 16 కిలోమీటర్ల నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్లాన్ చేసింది. ప్రాజెక్టు మొత్తం కూడా నివాస ప్రాంతాల మీదుగా తీసుకెళ్లడం వలన స్థిరాస్తులే లేకుండా పోతున్నాయని ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలోని స్థానికులు వాపోతున్నారు. ఇక జేబీఎస్ నుంచి వెళ్లే లైన్లో ఇప్పటికే ప్రాజెక్టు వెడల్పును 200 ఫీట్ల నుంచి 150ఫీట్లకు తగ్గిస్తేనే భూములు ఇస్తామని తేల్చి చెప్పడంతో ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాలేదు. జనావాసాలపై కాకుండా నిర్మాణాలు తక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా ఈ మార్గంలో ఉన్నాయని, ఆ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే తక్కువ ఆస్తి నష్టంతో ప్రాజెక్టు సులభంగా ముందుకు సాగుతుందని చెబుతున్నారు.