సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నిషేధిత జాబితా నగరాన్ని వణికిస్తున్నది. సిటీలో ఇండ్లు, ప్లాట్లు కొనాలంటేనే నగరవాసులు జంకుతున్నారు. రిజిస్ట్రేషన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆస్తులు అమ్ముకునేవారు, కొనాలనుకునేవారు అవస్థలు పడుతున్నారు. నగరంలోని వేలాది ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. దిక్కుతోచని స్థితిలో రెండు నెలలుగా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్‌కు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వేలాది ఫిర్యాదులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈనేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా నగరంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను స్వయంగా తనిఖీ చేశారు.
ముఖ్యంగా బంజారాహిల్స్, ఎస్ఆర్నగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు బాధితుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఆయా ఆఫీసులకు స్వయంగా వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారి ఫిర్యాదులను నమోదు చేసుకుని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కానీ అదంతా బాధితులను మభ్యపెట్టేందుకేనని తెలుస్తున్నది. కలెక్టర్ పర్యటించినా పరిస్థితిలో ఎలాంటి మార్పులు జరగలేదు.
నగరవ్యాప్తంగా ఎక్కడా రిజిస్ట్రేషన్లు జరగటంలేదు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే తమ పరిధి కాదని… కలెక్టరేట్లో ఫిర్యాదు చేయాలని సెలవిస్తున్నారు. ఏకంగా కలెక్టర్ వచ్చి తనిఖీలు చేపట్టినా మళ్లీ మొదటికే వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన న్యాయం చేయకుండా మభ్యపెట్టేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గడిచిన రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితా ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఎవరి భూమి నిషేధిత జాబితాలో ఉందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం కంటితుడుపు చర్యలకు పూనుకున్నది.
మంత్రులు, కలెక్టర్లు సమావేశాలు, సమీక్షలతో హడావుడి చేశారు. తప్పు జరిగిందని ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి బయటకు తీస్తామంటూ ప్రకటనలు చేశారు. రెవెన్యూ అధికారులు ప్రజల ఆస్తులను నిషేధిత జాబితా నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు.. మిగతా పనులన్నీ పక్కనపెట్టి అదే పనిలో నిమగ్నమైనట్లు నటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఎక్కడా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల నిషేధిత జాబితా నుంచి భూములు, ఇండ్లను తొలగించినట్లు చెప్తున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడంలేదు. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజావాణికి వేలాది ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన ఉండటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.