Panjagutta PS | వెంగళరావునగర్, ఆగస్టు 10 : బోనాల ఫలహార బండి ఊరేగింపులో రెచ్చగొట్టిన రౌడీషీటర్‌ను నియంత్రించకుండా.. ఆడ్డుకున్న తమను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి, థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని ముగ్గురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒళ్లంతా కుళ్లబొడిచి.. నోరు తెరిచి న్యాయమూర్తికి చెప్తే గంజా యి కేసు పెడుతామని, రౌడీషీట్లు తెరుస్తామంటూ బెదిరించారని తెలిపారు. శనివారం థర్డ్ డిగ్రీకు గురైన ముగ్గురు బాధితులు శివ, నాగేంద్ర, అనిల్‌లు యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమకు జరిగిన అన్యాయం పై ఏకరువు పెట్టారు. ఈ నెల 5న రౌడీషీటర్ బిల్లా పవన్ బోనాలసాకుతో అనుమతిలేని రూట్లో ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ ఇంటి ముందు రౌడీషీటర్ బిల్లా పవన్ ఓపెన్ టాప్ జీపులో కూర్చుని హుక్కా పీల్చుతూ కవ్వింపు చర్యలకుదిగాడు..దీంతో నవీన్‌యాదవ్ అనుచరులమైన తాము జీపు డ్రైవర్‌ను ముందుకు పోనివ్వాలని కోరగా.. డ్రైవర్‌ను కొట్టామని హత్యాయత్నం పెట్టిన కేసులో ఈ నెల 7న రాత్రి 3 గంటల సమయానికి జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో సీఐ ముందు లొంగిపోయాయని.. అక్కడి నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు. తమతోపాటు మరో 20 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారని.. ఇదంతా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి ఆనందం కోసం పోలీసులు తమను చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు.
రబ్బర్ బ్యాట్‌తో పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. మా చేతుల్ని వెనక్కి విరిచి తాడుతో బంధించి.. కుళ్లబొడిచారని, వారి దెబ్బలకు మా ఒళ్లంతా కమిలిన గాయాలయ్యాయని ముగ్గురు బాధితులు వాపోయారు. గొడవలో కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్, అతని సోదరుడు వెంకట్ యాదవ్‌ల ప్రమేయం ఉందని చెప్పాలని తమను చిత్రహింసలకు గురిచేసి బెదిరించారని తెలిపారు.
అంతేకాకుండా మధురానగర్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వరకు తమను రోడ్డుపై నడిపిస్తూ కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నోరు తెరిచి న్యాయస్థానంలో చెబితే అక్రమంగా గంజాయి కేసు పెడుతామని ఏసీపీ బెదిరించారని తెలిపారు. కోర్టులో సైతం కానిస్టేబుల్ సైగలతో మమ్మల్ని బెదిరించి.. తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని బాధితులు తెలిపారు.