మేడ్చల్, జూన్ 20 : మేడ్చల్‌లో పట్టపగలు దోపిడీ యత్నం జరిగింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న నగలు దుకాణంలో చోరీకి యత్నించారు. దుకాణదారుడిపై కత్తితో దాడికి తెగబడి, బంగారు, వెండి నగలు దోచుకోవాలని పన్నాగం పన్నారు. అయితే యజమాని చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం కారణంగా దుండగలు పరారయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం…మేడ్చల్ పట్టణంలోని ఆవల జగదాంబా జ్యువెల్లరీ దుకాణంలో గురువారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు. ఓ వ్యక్తి బురఖా వేసుకోగ, మరొకరు హెల్మెట్ ధరించి ఉన్నాడు.
ఆ ఇద్దరు నేరుగా నగల దుకాణంలోకి వచ్చారు. బురఖా వేసుకున్న వ్యక్తి యజమాని శేషారాంను బంగారం, వెండి నగలు ఇవ్వాలంటూ బెదిరించాడు. కుడివైపు చాతీపై పొడిచాడు. భయాందోళనకు గురైన యజమాని కొడుకు సురేశ్ దుకాణం లోపలికి వెళ్లి, తలుపువేసుకుని దాక్కున్నాడు. దుండగులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులో నగలు వేయాలంటూ బెదిరిస్తుంటే..‘ మీరే తీసుకోండి’ అంటూ శేషారాం చేతులెత్తేశాడు. హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి నగలను బ్యాగులో వేసే ప్రయత్నం చేస్తుండగా, దుండగుడి దాడిలో గాయపడ్డ శేషారాం వారి నుంచి తప్పించుకొని బయటికి వచ్చి చోర్ చోర్ అంటూ అరిచాడు. అతడిని అనుసరించిన దుండగలు భయపడి బైక్ స్టార్ట్ చేసుకొని పారిపోయారు.
ఇదే సమయంలో శేషారాం కుమారుడు సురేశ్ కుర్చీని వాహనం వెనుకాల కూర్చున్న వ్యక్తిపై విసిరాడు. అంతలోనే దుండుగులు పారిపోయారు. పోలీసులు చేరుకొని.. గాయపడిన శేషారాంను ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, పట్టపగలే నగల దుకాణాదారుడిపై కత్తితో దాడి చేసి, దొంగతనానికి యత్నించిన ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనా స్థలాన్ని డీసీపీ నితిక పంత్, అడిషనల్ డీసీపీ నర్సింహ రెడ్డి సందర్శించారు. నిందితులు హిందీ మాట్లాడారని, వారు ఉత్తర భారతదేశానికి చెందిన వారిగా భావిస్తున్నామన్నారు.