Hyderabad | సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ శివారులో దొంగల ముఠా స్వైర విహారం చేసింది. మేడిపల్లి పరిధిలోని చెంగిచర్లలో శుక్రవారం తెల్లవారుజామున 12 ఇళ్లలో చోరీలకు పాల్పడింది. చోరీ సమయంలో ముఠా కత్తులతో సంచరించడం స్థానికంగా కలకలం రేపింది.
సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో చాలామంది సెలవులపై వెళ్లడంతో దొంగల ముఠా ఇదే అదునుగా భావించింది. ఏ ఏ ఇండ్లకు తాళాలు వేసి ఉన్నాయో ముందుగానే రెక్కీ నిర్వహించారు. దానికి అనుగుణంగా కత్తులతో వచ్చిన ముఠా.. 12 ఇళ్లలో చోరీకి పాల్పడింది. అనంతరం కారులో ముఠా అక్కడి నుంచి పారిపోయింది. అయితే బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్తలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.