Ration Cards | మేడ్చల్, జనవరి 20(నమస్తే తెలంగాణ): కొత్త రేషన్ కార్డుల జారీలో అంత అయోమయం నెలకొన్నది. నేటి నుంచి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జరిగే గ్రామ, వార్డు సభల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జాబితాను ప్రవేశపెట్టేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నా.. నేడు జరిగే గ్రామ, వార్డు సభల్లో అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఏ విధంగా సిద్ధం చేసారన్న దానిపై అయోమయానికి గురువుతున్నారు. నాలుగు గ్యారంటీల్లో ప్రధానంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసాకు అర్హుల ఎంపిక పేరిట సర్వేలు జరుగుతున్నాయి. కాగా, ఈ నెల 26 నుంచి లబ్ధిదారులకు పథకాలను వర్తింపజేస్తామని చెబుతున్నా.. ఆచరణలో అమలు ఎలా అవుతుందోనన్న ఆందోళన దరఖాస్తుదారుల నుంచి వ్యక్తమవుతున్నది.
సర్వే చేయనేలేదు..
ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట ఎంతో ఆర్భాటంగా వివిధ పథకాలపై ప్రజల నుంచి దరఖాస్తులను ఏడాది కిందట స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల సర్వేనే చేయలేదు. ప్రజాపాలనలో రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుదారుల్లో మంగళవారం నుంచి జరిగే గ్రామ, వార్డు సభల్లో ప్రకటించే జాబితాలో వీరి ఎంపిక లేనట్లేనని తేలిపోయింది. ఏడాది కిందట చేసుకున్న దరఖాస్తుదారుల సర్వే ఎందుకు చేయలేదని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే వారికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కొత్తగా వచ్చిన దరఖాస్తులతో పాటు ప్రజాపాలనలో వచ్చిన అర్జీలను సర్వే చేసి పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు.
అర్హుల జాబితాలో ఉండేది వీళ్లే..
ఇటీవల చేసిన కులగణన సర్వేలో జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో 12,506 మందికి రేషన్ కార్డులను లేవని తేలిన పక్షంలో ఇదే జాబితాను గ్రామ, వార్డు సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇదేకాకుండా జిల్లా వ్యాప్తంగా మార్పులు..చేర్పులకు సంబంధించిన 1.21 లక్షల మంది అర్హుల ఎంపిక జాబితాను గ్రామ, వార్డు సభల్లో ప్రవేశపెట్టి అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల వివరాలను గ్రామ, వార్డు సభల్లో ఉంచి తదుపరి కొత్తగా వచ్చిన దరఖాస్తులతో కలిపి సర్వే(విచారణ) చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రేషన్ కార్డుల కోసం ఇంకా ఎన్నాళ్లు వేచి ఉండాల్సి వస్తుందోనని నిరుత్సాహానికి గురవుతున్నారు.
1.22 లక్షల దరఖాస్తులు
మార్పులు.. చేర్పుల రేషన్ కార్డులను జారీ చేసి భారీ సంఖ్యలో రేషన్ కార్డులు జారీ చేసినట్లు చెప్పుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలున్నాయి. రేషన్ కార్డులు ఉన్న వారికే మార్పులు.. చేర్పులను 1. 21 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్న వారికే చేసి.. అనేక మందికి రేషన్ కార్డులను ఇస్తున్నట్లు చెప్పుకునేలా చేస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 5,32,938 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా 1.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి.