తెలుగు యూనివర్సిటీ, జూలై 19: ఆంగ్ల భాష గురించి గొప్పలు చెప్పుకుంటున్నా ఆ భాష మాట్లాడే వారు ఈనాటికీ అల్ప సంఖ్యాకులేనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గ్రామాలతో సహా తెలుగు అంతటా పరిఢవిల్లుతున్నదని చెప్పారు. శాంతా వసంతా ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్‌లోని డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు కళామందిరంలో తెలుగు వర్సిటీ పూర్వ విసి, ప్రముఖ రచయిత ఆచార్య అనుమాండ్ల భూమయ్య రచించిన డా.సి నారాయణ రెడ్డి కథా కావ్య సమాలోచన గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పదనాన్నిఈ తరానికి పరిచయం చేయడానికి విరివిగా సాహిత్య కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాచీన భాష అయిన తెలుగుకు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. విదేశాలలో నివసిస్తున్న ప్రవాస ఆంధ్రులు తెలుగు భాషను కాపాడుకుంటున్నారని ఆయన వివరించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసంలో 25 ఏళ్ళ ప్రాయం నిండక ముందే డాక్టర్ సి .నారాయణ రెడ్డి నాగార్జునసాగరం,ఆ తర్వాత కర్పూర వసంత రాయలు, విశ్వనాథ నాయడు, రుతు చక్రం కథాత్మక గేయ కావ్యాలు వరుసగా రచించి సాహిత్య లోకంలో సుప్రసిద్ధులయ్యారని తెలిపారు. పరిశోధకుడు జీబీ శంకర్రావు గ్రంథాన్ని పరిచయం చేస్తూ కావ్యగతమైన సాహిత్య విశేషాలను విద్యార్థులకు సైతం సులభంగా అర్థమయ్యే విధంగా ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఈ గ్రంథాన్ని రచించారని తెలిపారు.
అనుమాండ్ల భూమయ్య ఈ గ్రంథాన్ని శాంతా వసంతా ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ కే ఐ వరప్రసాద్ రెడ్డికి అంకితం ఇచ్చారు. వర ప్రసాద్ రెడ్డి పై రాసిన అంకిత పద్యాలను గానం చేశారు. నారాయణ రెడ్డితో అనుబంధం, భూమయ్య సాహితీ మూర్తిమత్వంపై గౌరవం వల్ల కృతిని స్వీకరించే అవకాశం తీసుకున్నానని వరప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య సభను సమన్వయం చేశారు .ట్రస్టు కార్యదర్శి తొడుపునూరి నవీన్ పాల్గొన్నారు.