మేడ్చల్, మే 11(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితా ఎంపికపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో దరఖాస్తుల పరిశీలనను ఎంపీడీవోలు, కమిషనర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తిచేసి జిల్లా అధికారులకు అర్హుల జాబితాను అందజేశారు.
అందిన జాబితా మేరకు 30 మంది అధికారులు క్షేత్ర స్థాయిలో మరోసారి పరిశీలన చేసి జిల్లా కలెక్టర్కు అందజేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల ఎంపికను గత నెల ఏప్రిల్ 30 వరకు పూర్తి చేయాల్సి ఉండగా ఈనెల 10వ తేదీ పూర్తయినప్పటికీ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది.
ఇప్పటివరకు 308 మంది లబ్ధిదారులకు మాత్రమే వర్తింపజేశారు. నియోజకవర్గానికి 3,500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అ మేరకు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో 1,760, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 1,144 మంది లబ్ధిదారుల ఎంపిక జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నప్పటికీ అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు.