Power Cuts | సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘మణికొండ, పుప్పాలగూడ, డైమండ్హిల్స్ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంది. హెచ్చు తగ్గులతో సరఫరా అవుతుండటంతో ఇంట్లోని గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్కు ఫోన్ చేసినా స్పందన లేదు.’ అని మణికొండకు చెందిన విద్యుత్ వినియోగదారుడు అనిల్ మల్లాడి ఆదివారం ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇలా ఒక్క మణికొండ ప్రాంతంలోనే కాదు.. గ్రేటర్లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం అనేది నిత్యకృత్యంగా మారింది. వర్షం వస్తుందంటే చాలు … కరెంటు పోతుందన్న భయం నగరవాసులను వెంటాడుతూనే ఉన్నది. పది రోజుల నుంచి కురుస్తున్న వానలతో నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. ఇటీవల మధురానగర్ డీ బ్లాక్ ప్రాంతంలో ఏకంగా 28 గంటల పాటు సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.