మేడ్చల్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): డబుల్ ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ, రేషన్ దుకాణాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అందులో ఉండేవారు కోరుతున్నారు. ఈ విషయమై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలు .. అందులో సుమారు 1.05లక్షల మంది నివాసితులు ఉంటున్నారు. 1,000 ప్లాట్లు కల్గి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే డబుల్ ఇళ్ల కాలనీల వరకు బస్సు సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.
వెయ్యి ఫ్లాట్లు ఉన్న 9 డబుల్ ఇళ్ల కాలనీలు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 20 డబుల్ ఇళ్ల కాలనీలు ఉండగా ఇందులో వెయ్యి ప్లాట్లు ఉన్న 9 డబుల్ ఇళ్ల కాలనీలు.. రాంపల్లి, తూకుంట, దుండిగల్, నిజాంపేట్, ప్రతాపసింగారం, అహ్మద్‌గూడ, డి.పోచంపల్లి, కొర్రెముల, బాచుపల్లిలో ఉన్నాయి. ఈ కాలనీల్లో మొత్తంగా 30,068 డబుల్ బెడ్రూమ్లు ఉండగా 29,098 డబుల్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.
వాటిలో దాదాపు లక్ష పైచిలుకు మంది నివసిస్తున్నారు. వీరందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీలు, రేషన్ దుకాణాలతోపాటు బస్సు సౌకర్యం కల్పించాలని ఇటీవల మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన దిశ కార్యక్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి.
వెల్ఫేర్ సోసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి..
డబుల్ ఇళ్ల కాలనీలలో వెల్ఫేర్ సోసైటీలను త్వరగా నియమించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఇప్పటికే కొన్ని కాలనీలలో వెల్ఫేర్ సొసైటీలు ఏర్పాటైనప్పటికీ మిగతా కాలనీలలో కూడా త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి డబుల్ బెడ్రూమ్లను అందించి సొంతింటి కలను నిజం చేసిందని డబుల్ ఇళ్ల కాలనీవాసులు గుర్తు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలలో అన్ని సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు అందించందని పేర్కొంటున్నారు.
సౌకర్యాలు కల్పించాలి
డబుల్ ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. సమీపంలో వైద్య సేవలు అందించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రంతో పాటు రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి. డబుల్ ఇళ్ల కాలనీలు శివారు ప్రాంతంలో ఉన్న దృష్ట్యా బస్సు సౌకర్యం చేయాలి. వీలైనంత త్వరగా వెల్ఫేర్ సొసైటీలను నియమించాలి. – సందీప్, అహ్మద్‌గూడ