ఖైరతాబాద్, ఆగస్టు 19: నగరంలోని నిమ్స్ దవాఖానలో అన్‌స్కిల్డ్ ఉద్యోగుల పదోన్నతుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత ఉన్నా పైరవీలు, అక్రమ మార్గాల ద్వారా కొందరు సెమీ స్కిల్డ్ ఉద్యోగులుగా పదోన్నతులు పొందారంటూ పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నిమ్స్ దవాఖానకు నిత్యం 3వేల మందికి పైగా రోగులు వస్తుంటారు. ముఖ్యంగా ఇన్‌పేషెంట్‌గా ఉన్న వారికి సకల సపరియాలు అందించే ఔట్స్సోర్సింగ్ అన్‌స్కిల్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఏళ్లుగా వెట్టిచాకిరీ చేస్తూ..
నిమ్స్ దవాఖానలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో 1,400 మందికిపైగా అన్‌స్కిల్డ్ ఉద్యోగులు, 300కు పైగా సెమీ స్కిల్డ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్ స్కిల్డ్ ఉద్యోగులు రోగులకు 24గంటలపాటు అందుబాటులో ఉండడమే కాకుండా స్ట్రెచర్లు, వీల్ చైర్లపై వారిని సర్జరీలు, స్కానింగ్, రక్త, మూత్ర, ఇతర పరీక్షలకు తీసుకెళ్తుంటారు. పెద్ద పెద్ద పుండ్లు ఏర్పడ్డ రోగులతో పాటు మానని గాయాలకు డ్రెస్సింగ్ చేయడం, కట్లు కట్టడం లాంటివి కూడా చేస్తారు. ఇంతా కష్టపడుతున్నా వారికి సరైన గుర్తింపు లేక కాలం వెల్లదీస్తున్నారు.
దొడ్డిదారిన పదోన్నతలు..!
అన్‌స్కిల్డ్ ఉద్యోగుల్లో అనేక మంది విద్యాధికులు సైతం ఉన్నారు. యాజమాన్యం తల్చుకుంటే వారికి పదోన్నతి రూపంలో సముచిత స్థానం దక్కేది. దొడ్డిదారిన పదోన్నతులు కల్పిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఇందులో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని బహిరంగానే ఆరోపిస్తున్నారు. మొక్కుబడిగా కొందరిని సెమీ స్కిల్డ్ ఉద్యోగులుగా పదోన్నతులు కల్పించినా వారికి అన్‌స్కిల్డ్ బాధ్యతలనే అప్పగిస్తున్నారని నిట్టూరుస్తున్నారు. తాజాగా అర్హులైన అన్‌స్కిల్డ్ ఉద్యోగులు డైరెక్టర్ చాంబర్ వద్దకు వెళ్లి తమ గోడును వెల్లబోసుకొని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించి అర్హులకు పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్‌స్కిల్డ్ ఉద్యోగులు కోరుతున్నారు.