GO 111 | మూసీలోకి కాళేశ్వర జలాల పరవళ్లు నగరం నడిబొడ్డున గోదావరి పరవళ్లు తొక్కనున్నది. ‘కొండ’ కెగిసే గోదారమ్మ.. మూసీలో ముర్వనున్నది. ఇటు హుస్సేన్‌సాగర్, అటు జంట జలాశయాలను తరింపజేయనున్నది. విశ్వ నగరానికి సరికొత్త శోభ తీసుకురానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో గురువారం కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో నగరానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం జలాలతో హిమాయత్‌సాగర్, గండిపేట, హుస్సేన్‌సాగర్‌ను గోదావరి నదితో అనుసంధానానికి, వీటితో పాటు మూసీని కాళ్వేశ్వరం జలాలతో లింక్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే 111 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. దీంతో ఈ జీవో పరిధిలోని 84 గ్రామాల్లో ఇక హెచ్ఎండీఏ విధివిధానాలే వర్తించనున్నాయి. హైదరాబాద్‌లో జోన్ల వారీగా 6 డీఎంహెచ్‌వో పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే… చెంతనే ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం ఆ ఫలాలను అందుకోలేకపోతున్నాయి. రెండున్నర దశాబ్దాలకుపైగా 111 జీవో గ్రహణంతో అభివృద్ధి అనేది అందని ద్రాక్షగా మారిన 84 గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం వెలుగులు నింపింది. 111 జీవో ఉద్దేశానికి ఏమాత్రం విఘాతం కలగకుండా… అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఆ జీవో పరిధిలోని గ్రామాల్లో కూడా హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాంతాల మాదిరిగానే అభివృద్ధి ఫలాలు అందేలా 111 జీవోను ఎత్తివేస్తూ గురువారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ జీవో పరిధిలోని 84 గ్రామాల పరిధిలోని ప్రజల్లో అభివృద్ధి ఆశలు చిగురించాయి.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 18 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధి వందల కిలోమీటర్ల మేర గ్రామాల్లోకి విస్తరిస్తున్నది. విద్య, వ్యాపార, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుతో వెలిసిన ఆకాశహర్మ్యాలతో ఆ ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. కానీ… నగరానికి చెంతనే ఉన్నా, 111 జీవో పరిధిలోని 84 గ్రామాల్లో మాత్రం ఈస్థాయి అభివృద్ధి వెలుగులు ప్రసరించలేకపోతున్నాయి. భూమి విస్తీర్ణంలో కేవలం పది శాతంలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని, జీ+2 వరకు మాత్రమే నిర్మాణాలకు అనుమతుల వంటి నిబంధనలతో రెండున్నర దశాబ్దాలకు పైగా ఆ గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రత్యేక ని‘బంధనాల’ నుంచి విముక్తిని పొందాయి.
అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ నగరం మీదుగా కృష్ణమ్మ ఒడికి చేరుకునే మూసీ 1908లో చూపిన ఉగ్రరూపంతో తదుపరి వరద నియంత్రణకు నిజాం జంట జలాశయాలను నిర్మించారు. మూసీపై ఉస్మాన్‌సాగర్ (గండిపేట), ఈసీపై హిమాయత్‌నగర్ జలాశయాల నిర్మాణంతో వరదలను నియంత్రించడంతో పాటు జంట నగరాలకు తాగునీటిని కూడా అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనంతరం దశాబ్దాల పాటు ఈ జంట జలాశయాలు, జంట నగరాల్లోని ప్రజల దాహార్తిని తీర్చాయి. ఈ నేపథ్యంలో ఈ జలాశయాల పరిరక్షణకు 1996, మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111 జారీ చేసింది. రెండు జలాశయాల పరివాహక ప్రాంతాలు పది కిలోమీటర్ల రేడియస్‌లో 111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల పరిధిలోని 1,32,600 ఎకరాలు కేవలం వ్యవసాయ, వినోద జోన్లుగా మాత్రమే వినియోగించే పరిస్థితి నెలకొంది.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, గండిపేట మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో 1996 నుంచి జీవో 111 ఆంక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర అభివృద్ధి నలువైపులా విస్తరించినప్పటికీ… నగరానికి నైరుతిలో ఉన్న ఈ 84 గ్రామాల్లో మాత్రం విస్తరణ నిలిచిపోయింది. ప్రధానంగా ఐటీ, పారిశ్రామిక రంగాల్లోని సంస్థల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని దాటి అభివృద్ధి విస్తరించింది. మరోవైపు రియల్ రంగం అనేది హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల మేర విరాజిల్లుతున్నా… జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో మాత్రం విస్తరించలేకపోయింది. నగరం చుట్టూ ఉన్న భూముల రేట్ల ప్రకారం బేరీజు వేస్తే… ఇతర ప్రాంతాల్లో పది అంతకంటే రెట్ల విలువలు ఉన్నాయి.
జంట జలాశయాల నుంచి హైదరాబాద్‌కు రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా ఉండేది. ఉస్మాన్‌సాగర్ నుంచి 15 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ నుంచి 22 ఎంజీడీలు వచ్చేవి. గతంలో ఈ జలాశయాల నుంచి నీటి సరఫరా లేకుంటే నగరం అల్లాడిపోయేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హైదరాబాద్ తాగునీటి సరఫరాకు రానున్న దశాబ్దాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. కృష్ణా నది నుంచి మూడు దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించేలా సుంకిశాల పథకాన్ని పూర్తి చేస్తున్నారు. గోదావరి తాగునీటి పథకం ద్వారా రోజుకు 170 మిలియన్ గ్యాలన్ల గోదావరిజలాలు వస్తున్నాయి. సింగూరు-మంజీరా నుంచి రోజుకు 93 మిలియన్ గ్యాలన్లు… ఇలా జంట జలాశయాల నుంచి కాకుండానే నగరానికి రోజుకు 533 మిలియన్ గ్యాలన్ల తాగునీరు ఎలాంటి ఢోకా లేకుండా వస్తుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపురం వద్ద భారీ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీంతో అటు కృష్ణా… ఇటు గోదావరి నుంచి పుష్కలమైన నీటి లభ్యత ఉండటంతో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా వందేండ్లకు కూడా హైదరాబాద్ తాగునీటి వ్యవస్థకు ఢోకా ఉండదు.
84 గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. అందుకుగాను అన్నిరకాల చర్యలు తీసుకున్నారు. 111 జీవో ఉద్దేశమైన జంట జలాశయాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి… గత ఏడాది ఏప్రిల్ 20న జీవో 69 జారీ చేశారు. ఆ మేరకు జలాశయాల పరిరక్షణకు రూ.960 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, చుట్టూ ట్రంక్మెయిన్ ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో 111 జీవో ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు జంట జలాశయాలకు గోదావరి జలాల తరలింపునకూ మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఆ జలాశయాల పరిరక్షణకు కూడా మార్గం సుగమమైంది.
111 జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజలకు సంతృప్తికరమైన ప్రకటన రాబోతున్నది. జంట జలాశయాలకు ఎలాంటి ముప్పువాటిళ్లకుండా, పర్యావరణంపై ప్రభావం లేకుండా జీవో ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంటాం. జీవో ఎత్తివేతతో చేవెళ్ల ప్రాంతం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది. చేవెళ్ల ప్రాంతం మరో గోపన్‌పల్లి, గచ్చిబౌలి కానున్నది.
– 2019 ఏప్రిల్ 1న చేవెళ్లలో రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మీ బిడ్డగా చెప్తున్న. ఎవరూ భూములు అమ్ముకోవద్దు. ఇక్కడ ఐటీ పరిశ్రమలు, పొల్యూషన్ లేని పరిశ్రమలు రావాలె అని చెప్పారు. అవసరం లేకపోయినా అనేక గ్రామాల్లో 111 జీవో అమలవుతున్నది. పోయినసారే చేద్దామనుకున్న.. కానీ ఈ జీవోను ఎత్తివేసి కేసీఆర్, యాదయ్య కలిసి వంద కోట్లు తిన్నరంటరు.. బద్నాం ఎందుకని చేయలే.. కానీ ప్రామిస్ చేస్తున్న, మీకు శాపమైన 111 జీవోను ఎత్తివేస్త..
– 2018 డిసెంబర్ 3,5న చేవెళ్ల ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్
2019 ఏప్రిల్ 9న వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 111 జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి దగ్గట్టుగానే నేడు జీవో రద్దు చేసి నిరూపించారు.
చాలా ఏండ్లుగా రైతులను ఇబ్బందులు పెడుతున్న 111 జీవోను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. శంకర్పల్లి మండలంలో కొన్ని గ్రామాలు 111 ఉండడం వల్ల భూముల విలువలు చాలా తక్కువగా ఉండేవి. ఈ నిర్ణయం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
-బొల్లారం వెంకట్‌రెడ్డి, 111 జీవో రద్దు సమితి జిల్లాఅధ్యక్షుడు
ఏండ్ల కాలం నుంచి అభివృద్ధికి అడ్డుగా ఉన్న జీవో 111ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తివేయడంతో ఇక్కడి ప్రజల ఏండ్ల కల నేరవేరింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు.
– దండుఇస్తారి, సర్పంచ్ సుల్తాన్‌పల్లి
ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటే జీవో 111 నిబంధనలు అడ్డువచ్చేవి. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వలేమని చెప్పేవారు. నిర్మాణాలు చేపట్టినా గ్రామ పంచాయతీలు అనుమతులు ఇచ్చేది కాదు. జీవో 111 ఎత్తి వేస్తూ కేబినేట్లో నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం.
– సీహెచ్ కృష్ణారెడ్డి, శ్రీరాంనగర్, మొయినాబాద్
గత ప్రభుత్వాలు జీవో 111 పేరుతో ఆంక్షలు విధించడంతో మా భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి. నిర్మాణాలు చేయడానికి అనుమతులు లేవు. సీఎం కేసీఆర్ సార్ నిర్ణయంతో మా భూముల ధరలు పెరుగుతాయి.
– రూప్లానాయక్, రైతు పెద్దషాపూర్
111 జీవోపై గతంలో మా ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఇది శుభపరిణామం. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
– వనం లక్ష్మీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు