Hyderabad | కుత్బుల్లాపూర్, జూన్12: హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఘరానా దొంగతనం జరిగింది. కిరాణాషాపులోకి వెళ్లిన ఓ దుండగుడు గన్ చూపించి.. రూ.5లక్షల నగదు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లాడు. కొంపల్లి మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న లక్ష్మీ కిరణ జనరల్ స్టోర్ లో ఈ దొంగతనం జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన మోటూరి సాయిబాబా కొంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వైపునకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న లక్ష్మీ కిరాణా జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి అమ్మకాల ద్వారా వచ్చిన రూ.5లక్షల నగదుతో పాటు సెల్‌ఫోన్‌ను బ్యాగులో పెట్టుకుని షాపు మూసివేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో అకస్మాత్తుగా స్కూటీపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు హెల్మెట్ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని షాపులోకి వచ్చారు. షాపు యజమాని దగ్గరకు వెళ్లి గన్ చూపించి బెదిరించి, అతని వద్ద ఉన్న నగదు బ్యాగును లాక్కొని వెళ్లాడు. ఈ క్రమంలో షాపులో పనిచేస్తున్న సేల్స్‌బాయ్ పర్వేజ్ వారిని అడ్డుకోబోయాడు. కానీ వారి నుంచి తప్పించుకుని బయటకు వెళ్లాడు. అప్పటికే మరోవ్యక్తి షాపు బయట బైక్‌పై రెడీగా ఉండటంతో ఇద్దరూ కలిసి మున్సిపల్ కార్యాలయం వైపునకు పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో ఇదే షాపులో 10 లక్షల విలువచేసే సిగరెట్ ఇతర వస్తువుల అపహరణ…
ఇదే షాపులో గతంలోనూ ఓ దొంగతనం జరిగింది. దాదాపు రూ.10 లక్షల విలువ చేసే వివిధ రకాల వస్తువులతో పాటు సిగరెట్ డబ్బాలను ఎత్తుకెళ్లారు. రాత్రి షాపు ముందు డీసీఎం వాహనం నిలిపి గుట్టు చప్పుడు కాకుండా వస్తువులతో హుడాయించిన సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇదే ప్రాంతంలో వరుస దొంగతనాలు, సెల్ ఫోన్లు, పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు దొంగలింపబడ్డాయని స్థానికులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
వరుస సంఘటనలతో ఉలిక్కిపడుతున్న కొంపల్లి ప్రజలు
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని రోజుల నుంచి వరుసగా దొంగతనాలు, మర్డర్, ఇతర వ్యవహారాలు జరగడం పట్ల స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దొంగతనం జరిగిన షాపు సమీపంలో ఉన్న వెనకాల వీధిలో సాయంత్రం సమయంలో మార్కెట్లో మర్డర్ జరగడం విదితమే. కాగా నిత్యం ప్రజలు, వ్యాపారస్తులు, కూలీలతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ వరుసల సంఘటనలు జరగడం పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వరుస సంఘటనలు జరగడం పట్ల పోలీస్ యంత్రాంగం నిఘా పూర్తిగా విఫలం చెందిందని స్థానికులు మండిపడుతున్నారు.