బంజారాహిల్స్,మే 5 : ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళకు చెందిన ఆభరణాలు మాయమైన సంఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్పల్లి సమీపంలోని వివేకానందనగర్కు చెందిన మంత్రాల కామాక్షి అనే మహిళ అనారోగ్యంతో ఫిబ్రవరి 25న బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఒమేగా ఆస్పత్రిలో చేరారు.
మార్చి 10న ఆస్పత్రిలో ఆమెకు కొన్ని పరీక్షలు చేయాల్సి రావడంతో ఒంటిమీద ఉన్న ఆభరణాలు తీసి కర్చీఫ్లో చుట్టి గదిలో ఉన్న అల్మారాలో పెట్టారు. పరీక్షలు పూర్తయిన తర్వాత అల్మారాలో పెట్టిన ఆభరణాల విషయం మర్చిపోయారు. నాలుగు రోజుల తర్వాత అల్మారాలో చూడగా ఆభరణాలు కనిపించలేదు.
సుమారు 10తులాల ఆభరాణాలు అల్మారాలో నుంచి మాయమయ్యాయి. హాస్పిటల్ నిర్వాహకులకు చెప్పినా స్పందించకపోవడంతో బుధవారం బాధితురాలి భర్త మురళీకృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.